సిటీబ్యూరో, మార్చి 22(నమస్తే తెలంగాణ): విశ్వనగరాభివృద్ధిలో కీలకపాత్రను పోషించే హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రస్తుతం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. నగర మౌలిక సదుపాయాల కల్పన కోసం గతంలో ప్రతిపాదించిన భారీ నిధుల సేకరణలో భాగంగా హెచ్ఎండీఏ ఆస్తులను తనఖా పెట్టాల్సిన పరిస్థితికి దిగజారింది. వేల కోట్ల ప్రతిపాదనలకు వందల కోట్ల నిధులను కేటాయించడంతో..ఎలివేటెడ్, రేడియల్ రోడ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కీలకమైన ప్రాజెక్టులను చేపట్టేందుకు అనివార్యంగా ఆస్తులను తనఖా పెట్టాల్సి వస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగర విస్తరణలో భాగంగా హెచ్ఎండీఏ పరిధిని 11 జిల్లాల వెంబడి విస్తరించి ఉన్న రీజనల్ రింగు రోడ్డు వరకు పొడిగించారు. కానీ ఆ స్థాయిలో నిధులు కేటాయించడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైంది. హెచ్ఎండీఏ చేతిలో ఉన్న రూ. 10వేల కోట్ల ప్రాజెక్టులను నామామాత్రం నిధులతో ఎలా చేపడుతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తనాఖా అనివార్యమేనా?
గతంలో హెచ్ఎండీఏ భూములను తనాఖా పెట్టి రుణాలు సేకరించేందుకు ఒక్క ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేసింది. కానీ ప్రభుత్వ మార్గదర్శకాల లోపంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు సొంతంగా నిధులు సమకూర్చుకోవాలని సర్కారు చేతులెత్తివేయడంతో సంస్థ వద్ద ఉన్న భూములు, ఆస్తులే ఇప్పుడు కీలకంగా మారాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన హెచ్ఎండీఏ ఆస్తులను అమ్ముకోవాలి లేదంటే ఉన్న వాటిని తాకట్టులో పెట్టాల్సిన దుస్థితికి చేరింది. ఒకప్పుడు రాష్ట్రంలోనే అన్ని విభాగాల కంటే ఆర్థికంగా పరిపుష్టి సాధించిన హెచ్ఎండీఏ.. నిర్మాణ అనుమతుల రూపంలో వచ్చే ఆదాయం పడింది. దీంతో సొంత ప్రాజెక్టులకు కూడా నిధులు సర్దుబాటు చేసుకోలేని స్థాయికి చేరింది. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల మధ్య హెచ్ఎండీఏ చేతిలో ఉన్న రూ. 25వేల కోట్ల ప్రాజెక్టుల పనులను మొదలుపెట్టేందుకు తప్పనిసరిగా తనాఖా తప్ప మరో మార్గమే లేదనీ, సర్కారు ఇచ్చిన నిధులు కూడా ఎటూ సర్దుబాటు చేసుకోలేనివి ఉన్నాయి.
ప్రశ్నార్థకంగా ప్రాజెక్టులు…
సర్కారు దీర్ఘకాలిక ప్రయోజనాలను విస్మరించడంతో హెచ్ఎండీఏ కీలకమైన ప్రాజెక్టుల భవిత ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో భాగంగా చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు, బంజారాహిల్స్ నుంచి శిల్పా లే అవుట వరకు ప్రతిపాదించిన కీలక ఎలివేటెడ్ కారిడార్‌కు నిధుల కొరత శాపంగా మారింది. ఇందులో ఎలివేటెడ్ కారిడార్, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లకు భూ సేకరణ దశలోనే ఉన్నాయి. కానీ గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరానికి అరకొర నిధుల కేటాయింపుతో అభివృద్ధి కుంటుపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.