GHMC | సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ)/ముషీరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో ఆదివారం గ్రేటర్‌లోని పలు చోట్ల వర్షం దంచి కొట్టింది. మారేడ్‌పల్లిలోని న్యూ మెట్టుగూడలో రాత్రి 9గంటల వరకు అత్యధికంగా 7.75 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. వర్షం నీరు కారణంగా లోతట్టు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. ముషీరాబాద్ రాంనగర్ ఆదర్శ అపార్టుమెంట్ సమీపంలో వరద నీటిలో కారుతో సహా నలుగురు చిక్కుకుపోయారు.
స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి వారిని కాపాడారు. కాగా, న్యూ మెట్టుగూడ 7.75 సెం.మీ, యూసుఫ్‌గూడ 7.65, ముషీరాబాద్ 7.3, జూబ్లీహిల్స్ ఎంసీఆర్హెచ్ఆర్డీ 7.2, హెచ్‌సీయూ, శేరిలింగంపల్లి, మాదాపూర్ 6.95, నాచారం 6.88, సీతాఫల్మండి 6.85, ముషీరాబాద్ తాళ్లబస్తీ 6.3, బన్సీలాల్‌పేట, మోండా మార్కెట్ 6.28, పాటిగడ్డ, బుద్ధానగర్ 6.15, ఉప్పల్ చిలుకానగర్ 6.0, అల్లాపూర్, ఉస్మానియా యూనివర్సిటీ 5.90, రహ్మత్‌నగర్, భోలక్‌పూర్ 5.73, మౌలాలి, ఓల్డ్ సుల్తాన్‌నగర్ 5.55, గచ్చిబౌలి, ఉప్పల్ 5.40, ఖైరతాబాద్, బేగంపేట, షేక్‌పేట 5.20 సెం.మీల వర్షపాతం నమోదైంది.
ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్ పలు ప్రాంతాలను అధికారులతో కలిసి సందర్శించారు. వాటర్ లాగింగ్ పాయింట్లు, క్యాచ్పిట్స్, మ్యాన్ హోళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆవర్తనం ప్రభావంతో రాగల మరో మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వానలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు.