సిటీబ్యూరో: సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు లషర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 7న చేపట్టనున్న శాంతిర్యాలీకి అనుమతించాలని సోమవారం హైకోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. గత నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ కోసం పోలీసు శాఖను అనుమతి కోరగా, చివరి నిమిషంలో అధికారులు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో లషర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ జనవరి 21న నగర పోలీసు కమిషనర్, మలాజిగిరి డీసీపీలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యారడైజ్ గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీకి అనుమతించాల్సిందిగా కోరుతూ మరోమారు దరఖాస్తు చేశారు.
స్పందన లేకపోవడంతో ఫిబ్రవరి 7 న ర్యాలీకి అనుమతించాలని కోరుతూ పవన్ కుమార్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఇరువర్గాల వాదనలు విన్న హై కోర్టు 21న చేసిన దరఖాస్తుపై సానుకూలంగా స్పందించాలని, అవసరమైతే లషర్ జిల్లా సాధన సమితి సభ్యులతో సంప్రదించి తగిన నిబంధనలు రూపొందించి పూర్తి నివేదికను 5వ తేదీలోగా సమర్పించాలని హైకోర్టు 13వ బెంచ్ న్యాయమూర్తి తుకారాం జీ పోలీసు శాఖను ఆదేశించారు.