కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని మరిచి.. పెద్దలకు పెద్దపీట వేసి.. పేదలకు నీడ లేకుండా చేస్తుందని..మూసీ జన్ ఆందోళన్ సంస్థ ఆధ్వర్యంలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న రియల్ వ్యాపారంపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
– ఖైరతాబాద్, నవంబర్ 28
ఖైరతాబాద్, నవంబర్ 28 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని మరిచి… పెద్దలకు పెట్ట పీట వేసి…. పేదలకు నీడ లేకుండా చేస్తోంది’ అని వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ జన్ ఆందోళన్ సంస్థ ఆధ్వర్యంలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో జరుగుతన్న రియల్ వ్యాపారంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మానవహక్కుల వేదిక ప్రతినిధి జీవన్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవనం అంటూ ప్రకటన చేశారు తప్ప దానిపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వలేదన్నారు. ఏ ప్రాజెక్టు చేపట్టినా ప్రజలకు సరైన సమాచారం ఇవ్వాలన్నారు. కాని అలాంటి చర్యలేమి ప్రభుత్వం చేపట్టలేదన్నారు.
ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకుపోతారో చెప్పలేదని, కాని రెండు నెలలకోసారి ప్రకటనలు జారీ చేస్తుందన్నారు. ఏ ప్రాజెక్టు చేపట్టినా చట్టం పరిధిలో దాని డిటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు రూపొందించి బహిర్గతపర్చాలని, కాని ఇప్పటి వరకు అలాంటి చర్యలేమి చేపట్టలేదన్నారు. ఇటీవల ఫాల్కన్ రెసిలియెంట్ ఇన్ఫ్రా కన్సల్టెంట్స్ కంపెనీ డీపీఆర్ రిపోర్టు లేకుండా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును ఓ సంస్థ తయారు చేసిందని, ప్రభుత్వానికి తెలియకుండానే ఆ రిపోర్టు తయారు చేశారా? అని ప్రశ్నించారు.
సిటీజన్స్ అలయెన్స్ ఫర్ రెసిడెంట్స్ రైట్స్ సస్టెయినబుల్ ఇంక్లూజీవ్ రివర్ డెవలప్మెంట్ సంస్థ ప్రతినిధులు ఆనంద్, విశాలీ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను డీపీఆర్ లేకుండా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఎందుకు బదిలీ చేశారని, ప్రజల ఇండ్లు ఎలా కూలగొడుతారని ప్రశ్నించారు. అంతేకాకుండా ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) నుంచి రూ.4,100 కోట్లు రుణాన్ని ఆమోదించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారని, కానీ నిజానికి అలాంటిదేమి లేదన్నారు. ప్రజలను సంప్రదించకుండా, ఎలాంటి క్లియరెన్స్ లేకుండా ఈ మూసీ రివర్ ఫ్రంట్ ఎలా చేపడుతారని ప్రశ్నించారు.
మూసీలో రసాయనిక వ్యర్థాలను తొలగించకుండా సుందరీకరణ చేస్తామంటున్నారని, ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులా ముందుకు తీసుకెళ్తున్నారని, ప్రజల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. చట్టాలకు అనుగుణంగా డీపీఆర్ చేయకుండా ఇంత పెద్ద ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకుపోతారని ప్రశ్నించారు. ప్రజలకు స్పష్టత ఇచ్చేంత వరకు మూసీ ప్రాజెక్టు చేపట్టవద్దని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు సజయా, నివాస హక్కుల కమిటీ ప్రతినిధి వర్గీస్ థెక్నాథ్, ఎన్ఏపీఎం సంస్థ ప్రతినిధి మీరా సంఘమిత్ర, హ్యూమన్ రైట్స్ ఫోరం ప్రతినిధి సయ్యద్ బిలాల్ తదితరులు పాల్గొన్నారు.