సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ): నగరవాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలిగిస్తామని, కేబీఆర్ చుట్టూ ఉన్న 6 జంక్షన్లను ట్రాఫిక్ రహిత కూడళ్లుగా మారుస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన హెచ్ సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్టు రివర్స్ గేర్‌లో వెళ్తున్నది. రూ.1,090 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు న్యాయపరమైన చిక్కులు, రాజకీయ ఒత్తిళ్ల సుడిగుండంలో చిక్కుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఆర్డీపీ ద్వారా అద్భుతమైన ఫె్లైఓవర్లు, అండ ర్ పాస్‌లను శరవేగంగా పూర్తిచేసి నగర రూపురేఖలను మార్చితే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ‘హెచ్-సిటీ’ పేరుతో చేపట్టిన ప్రాజెక్టులు మాత్రం కాగితాలకే పరిమితమవుతున్నాయి. గడిచిన రెండేళ్లలో ఒక్క ప్రాజెక్టు పని మొదలు కాలేదు. ముఖ్యంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పారు చుట్టూ రూ.1,090 కోట్లతో ఆరు జంక్షన్ల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటంగా శంకుస్థాపన చేసినా.. నేటికీ ఆ ప్రాజెక్టు ఒక అడుగు కూడా ముందుకు పడకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది. అధికారుల తొందరపాటు, పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ఈ ప్రాజెక్టు ఇప్పుడు న్యాయవివాదాల్లో చిక్కుకుంది. భూ సేకరణపై స్పష్టమైన విధివిధానాలు లేకుండా, ఎవరిని సంప్రదించకుండానే మారింగ్ లు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హెచ్సిటీ ప్రాజెక్టుపై కేవలం మధ్య తరగతి ప్రజలే కాదు, అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి తొందరపాటుతో అనాలోచితంగా అధికారులతో మారింగ్లు వేయించారంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు లోలోన మదనపడుతున్నారు. వాస్తవంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేబీఆర్ పార్కు చుట్టూ వీవీఐపీలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధించి ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. జూబ్లీహిల్స్ రోడ్ నం 92లో నివసించే మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి సంబంధించిన 250 గజాల స్థలం, జూబ్లీహిల్స్ రోడ్ నం 45లో ఉన్న హీరో, ఎమ్మెల్యే(ఏపీ) నందమూరి బాలకృష్ణకు చెందిన 377 గజాలు, మాజీ మంత్రులు సమర సింహారెడ్డి, షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి ఒక్కొక్కరి నుంచి దాదాపు 300 గజాల స్థలాన్ని అధికారులు సేకరించాల్సి ఉంది. ఐతే భూ సేకరణకు ఏ ఒక్కరూ ముందుకు రావడంలేదని సమాచారం. సమన్వయం చేయాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి కనీసం సొంత పార్టీకి సంబంధించిన నేతలనే ఒప్పించలేకపోయారనే విమర్శలున్నాయి. ఇందుకు జానారెడ్డి సంఘటనే నిదర్శనం..భూ సేకరణలో భాగంగా స్వయంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ జానారెడ్డి ఇంటికి వెళ్లి ఒప్పించే ప్రయత్నం చేసినా ఆయన ససేమిరా అన్నట్లు సమాచారం.
ఇలా భూ సేకరణపై స్పష్టత లేకుండా ఏళ్ల తరబడి కాలయాపన చేశారు. మన్సిపల్ శాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి భూసేకరణ విషయంలో పూర్తిగా విఫలం అయ్యారనే విరమ్శలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే .భూ సేకరణపై అడుగడుగునా అవాంతరాలు, న్యాయపరమైన చిక్కులు సర్కార్‌ను వెంటాడుతున్నాయి. సరైన ప్రణాళిక లేకపోవడం, అధికారుల అత్యుత్సాహం వెరసి కేబీఆర్ పార్కు ప్రాజెక్టు రెండేైళ్లెనా పట్టాలెక్కలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారో? పూర్తిచేయడానికి ఎంత సమయం తీసుకుంటారో? అనే విషయం అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది.
జూబ్లీహిల్స్ సర్కిల్-18లోని బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ వరకు 100, 120 అడుగుల ఆర్డీపీ వరకు వెడల్పు చేయబడిన రోడ్డు భాగంలో బీటీ రోడ్డు వేసేందుకు రూ. 150కోట్ల పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేశారు. ఐతే భూసేకరణపై స్పష్టత లేకుండానే టెండర్లు పిలవడం, అందులో భూ సేకరణ విభాగం అధికారుల నోటీసులో లేకుండా టెండర్లు పిలిచిన తీరు చర్చనీయాంశంగా మారింది. దీంతో క్షేత్రస్థాయిలో రహదారి విస్తరణకు ఆస్తుల స్వాధీనంపై స్పష్టత రావడం లేదు. 16 చోట్ల భూ సేకరణకు సంబంధించి అధికారులు యజమానులకు సీ నోటీసులు జారీ చేశారు. మరో 16 చోట్ల ఆస్తుల స్వాధీనానికి యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ ముఖ్య నేత సమీప బంధువు సైతం దాదాపు 300 గజాల మేర స్థలం కోల్పోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మొన్నటి దాకా న్యాయ స్థానంలో సింగిల్ డిజిట్లో ఉన్న పిటిషన్లు డబుల్ డిజిట్ దాకా వెళ్లడం ఈ ప్రాజెక్టు భవితవ్యాన్ని అగమ్యగోచరంగా మార్చాయి అనే టాక్ నడుస్తోంది. మారెట్ రేట్ ప్రకారం పరిహారం ఇవ్వలేక, ప్రత్యామ్నాయంగా టీడీఆర్‌లు అంటగట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను యజమానులు తిప్పికొడుతుండటం గమనార్హం. మొత్తానికి, పకా ప్రణాళిక లేకుండా కేవలం ప్రచార ఆర్భాటం కోసం చేపట్టిన ‘హెచ్-సిటీ’ పనులు ఇప్పుడు సరార్ మెడకు చుట్టుకున్నాయి. పరస్థితి చూస్తుంటే కోర్టు కేసులు తేలే వరకు ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించేలా కనిపించడం లేదు.