సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రో బోగీలపై ప్రభుత్వం చేసే ప్రకటనలు ప్రచారానికే పరిమితం అవుతున్నాయి. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొత్త బోగీలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా… సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. కానీ రేపుమాపు అనుకుంటూ బోగీల అంశాన్ని సాగదీస్తూనే ఉంది. కొత్త బోగీలను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామంటూ గడిచిన ఏడాది కాలంగానే నెట్టుకొస్తూనే ఉంది. కానీ ఇప్పటివరకు కనీసం కొనుగోలు చేయాల్సిన కోచ్ ఫ్యాక్టరీని ఎంపిక చేయలేదు. కానీ అదనపు బోగీలతో నగరంలో మెట్రో సేవలను విస్తరించిన స్థాయిలో కాంగ్రెస్ సర్కారు ప్రచారం చేసుకుంటోంది. దీనికి మెట్రో సంస్థలో కొలువుదీరిన కొందరు రిటైర్డ్ అధికారులు కూడా వంతా పాడుతూ అసాధ్యమైన విషయాలతో జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇప్పట్లో తోపులాటలు, కిక్కిరిపోయిన జనాల నడుమ ప్రయాణాలు ఇప్పట్లో తప్పేలేవు.
పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా..
పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొత్త బోగీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ, మెట్రో నిర్వహణ సంస్థలు కాలయాపన చేస్తున్నాయి. ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసి చేతులు దులుపుకొన్న యంత్రాంగం నగరవాసులను మెట్రో ప్రయాణాన్ని నరకంగా మార్చేస్తోంది. రద్దీకి అనుగుణంగా అదనపు బోగీలను తీసుకోవాల్సి ఉన్నా… అందుకు తగిన ప్రణాళికలు లేకపోవడంతో రెండేళ్లు గడిచిన కార్యరూపంలోకి రాలేదు. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య నిత్యం పెరుగుతున్నా… అందుకు సరిపడా బోగీలు లేవు. దీంతో మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో పీక్ అవర్స్‌లో నిండిపోతున్నాయి. కిక్కిరిసిన జనాల నడుము గమ్యస్థానాలకు చేర్చుతుందే తప్పా… కొత్తగా బోగీలను ఏర్పాటు చేసి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలను కల్పించడంలో హైదరాబాద్ మెట్రో నిర్లక్ష్యం చేస్తోంది. నష్టాల పేరిట అదనపు బోగీల విషయాన్ని పక్కన పెడుతుండటంతో రద్దీ సమయంలో గంటల కొద్ది స్టేషన్ల వద్ద ఎదురుచూడాల్సిన వస్తోంది. కొంతమంది ప్రత్యామ్నాయ మార్గాల్లో జర్నీ చేసే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది.
రెండేండ్లుగా కాలయాపన…
అదనపు బోగీల విషయాన్ని రెండేండ్లుగా సర్కారు ప్రచారం చేస్తూనే ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఓ మంత్రి మాట్లాడుతూ… అదనపు బోగీల నిర్మాణానికి సిద్ధమైనట్లుగా తెలిపారు. త్వరలోనే కొత్త బోగీలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. ఈ విషయం ప్రకటించి రెండేళ్లు గడిచింది కానీ ఇప్పటివరకు కొనుగోలు చేయాల్సిన సంస్థను ఖరారు చేయలేదు. గతంలో పుణే కోచ్ ఫ్యాక్టరీతో సంప్రదింపులు చేసిన యంత్రాంగం… ఆర్డర్ తీసుకోవాలంటే పెట్టిన నిబంధనలను చూసి యంత్రాంగమే వెనకడుగు వేసినట్లుగా సమాచారం. అప్పటి నుంచి కోచ్‌లను సిద్ధం చేసే కంపెనీల కోసం వెదుకుతూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఖరారు చేయలేకపోయారు. ఇలా రెండేళ్ల కాలాన్ని నెట్టుకొచ్చిన కాంగ్రెస్ సర్కారు… ఇప్పటికిప్పుడూ కొత్త బోగీలకు టెండర్లు పిలిచి, ఆర్డర్ చేసినా ఎప్పటిలోగా అందుబాటులోకి తీసుకువస్తారనే అంశాన్ని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది.
అదనపు బోగీలకు మరో ఏడాది
గతేడాది జూలై నాటికే కొత్త బోగీలను ఏర్పాటు చేసుకోవాలని మెట్రో భావించింది. కానీ ఎల్ అండ్ టీ ఆసక్తి చూపలేదు. ఇప్పటికే నిర్వహణ భారం పేరిట అరకొర వసతులతోనే సేవలను అందిస్తుండగా… కొత్త బోగీలు అసాధ్యమేనన్నట్లుగా వ్యవహారించింది. ఇక హెచ్ఎంఆర్ఎల్ కూడా అంతగా దృష్టి సారించలేదు. అయితే ఇటీవల కాలంలో క్రమంగా పెరుగుతున్న మెట్రో ప్రయాణికులతో సాధారణ సమయంలోనూ స్టేషన్ల వద్ద భారీగా రద్దీ ఏర్పడుతున్నది. పరిమితికి మించి కొన్ని సందర్భాల్లో ప్రయాణించాల్సి వస్తుందని, హెచ్ఎంఆర్ఎల్ ఎట్టకేలకు కొత్త బోగీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించినా… ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు. తొలి దఫా నాలుగు బోగీలు, మరో దఫా 6 బోగీలను తీసుకు వచ్చేలా పుణే కోచ్ ఫ్యాక్టరీని కోరింది. ఒకవేళ ఆర్డర్ చేసినా… మెట్రో చేతికి అందడానికి కనీసం 9-12 నెలల సమయం పట్టనుంది. ఇప్పటికిప్పుడు మెట్రో సంస్థ బోగీల కోసం ఆర్డర్ చేసినా… ఏడాది తర్వాతే వాటిలో ప్రయాణించే వీలు ఉంది.