కందుకూరు, మే 1 : ‘అధైర్య పడకండి.. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం పరిహారం అందిస్తుంది..’ అని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, అధికారులు అన్నదాతలకు భరోసానిచ్చారు. వడగండ్ల వానలు, గాలిదుమారం చేతికొచ్చిన పంటలను సర్వనాశనం చేశాయి. రైతులు కోలుకోలేని దెబ్బతీశాయి. వరిపైరు, మక్కజొన్న, మామిడి నేలవాలగా, పొలాల్లో మోకాళ్లలోతు నీరు చేరింది. నియోజకవర్గం వ్యాప్తంగా రైతులకు భారీ నష్టం మిగిల్చింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు రంగంలోకి దిగి నష్టపోయిన పంటల వివరాలు సేకరించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం జడ్పీటీసీ బొక్క జంగారెడ్డితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు నష్ట పోయిన పంటలను పరిశీలించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్ల్లి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అత్యధికంగా మండల పరిధిలోని మీర్ఖాన్పేట్, ఆకులమైలారం గ్రామాల్లో ఆదివారం రాత్రి ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షంతో వరి, టమట, మొక్క జోన్న పంటలతో పాటు అనేక పంటలు నీటి మునిగి దెబ్బతిన్నాయి.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, తాసీల్దార్ మహేందర్‌రెడ్డి, వ్యవసాయ ఇన్చార్జి అధికారి యాదగిరి, ఆయా గ్రామాల సర్పంచులు గొరిగె కళమ్మ రాజు, బ్రాహ్మణపల్లి జ్యోతీచంద్రశేఖర్ గుప్తా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిర్ర సాయిలు, గండు నర్సింహ, డైరెక్టర్ పొట్టి ఆనంద్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్‌రెడ్డి, గుయ్యని సామయ్య, సదానంద్‌గౌడ్, కృష్ణారెడ్డి, వెంకటేశ్ ఉన్నారు. నష్టపోయిన పంటల వివరాలను అధికారులు గుర్తించి.. నివేదిక ఆధారంగా నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపారు.