సిటీబ్యూరో: మల్కాజిగిరి పోలీ స్ కమిషనర్‌గా బి.సుమతిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న అవినాశ్ మహంతిని డ్రగ్ కంట్రోల్ విభాగానికి ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ తరుణ్ జోషిని ప్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కమిషనర్ సుధీర్‌బాబు ఈ నెల 30న ఆయన రిటైర్డ్డ్ అవుతుండడంతో ఆయన స్థానంలో తరుణ్జోషిని నియమించారు.
కాగా, రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ను పునర్విభజన చేసి, రాచకొండ పేరును తొలగించిన ప్రభుత్వం, కొత్తగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేసి, మొదటి కమిషనర్‌గా అవినాశ్ మహంతిని నియమిస్తూ డిసెంబర్ 30న కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అవినాశ్ మహంతి వచ్చి ఇంకా నాలుగు నెలలు కూడా పూర్తికాలేదు. సుమారు నెల రోజులుగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ఎన్నికల అధికారిగా బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. ఇంతలో శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. రాజకీయ ఒత్తిళ్లతోనే అవినాశ్ మహంతి బదిలీ జరిగిందని పోలీసుల్లో చర్చించుకుంటున్నారు.