మియాపూర్, మార్చి 10: హైదర్‌నగర్ డివిజన్లో చెరువులకు మహర్దశ పట్టనున్నది. చెరువుల సంరక్షణతో పాటు వాటి సుందరీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువు పూర్తిస్థాయి సుందరీకరణ పనులు ప్రారంభించారు. ప్రధానంగా విలువైన చెరువు స్థలాల సంరక్షణ, చెరువు కట్టల పటిష్టం, డ్రైనేజీ నీరు చేరకుండా డైవర్షన్ ఛానెళ్ల నిర్మాణం, వాకింగ్ ట్రాక్, పచ్చదనం సహా పలు ఇతర అభివృద్ధి పనులతో అనతికాలంలోనే అలీ తలాబ్ చెరువు తన రూపురేఖలు మార్చుకుని ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధం అవుతున్నది. ఇందుకు సంబంధించిన సుందరీకరణ పనులు సైతం ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే సహా కార్పొరేటర్ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ వేగవంతం అయ్యేలా పలు సూచనలను చేస్తున్నారు. ఏప్రిల్ చివరి కల్లా సుందరీకరణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవటమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు.
హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని రామ్ నరేశ్ నగర్లో 15 ఎకరాలలో అలీ తలాబ్ చెరువు విస్తరించి ఉన్నది. విలువైన ఈ స్థలం అన్యాక్రాంతం కాకుండా రక్షించటంతో పాటు సుందరీకరించి ప్రజలకు అందించేందుకు ఇటీవల నిధులను సైతం మంజూరు చేశారు. రూ.1.83 కోట్ల నిధులతో 1.6 కిలో మీటర్ల మేర ట్యాంక్‌బండ్ పటిష్టత, వాకింగ్ ట్రాక్, బ్రిడ్జి విస్తరణ, వరద నీటి కాలువ నిర్మాణం, చెరువు చుట్టూ దెబ్బతిన్న చోట ఫెన్సింగ్ సహా ఇతర సుందరీకరణ పనులను ప్రారంభించారు. వాకింగ్ ట్రాక్‌ను అందంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలను రూపొందించారు. ట్రాక్ చుట్టూ పచ్చదనం పెంపొందించేలా మొక్కలను నాటాలని నిర్ణయించారు. శుభ్రమైన నీటితో అలీ తలాబ్ తటాకం ఇక్కడి ప్రాంతానికి తలమానికంగా మార్చేలా చేయటమే తమ లక్ష్యమని గతంలో పనులను పరిశీలించిన విప్ గాంధీ సైతం పేర్కొన్నారు. ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికపుడు పనులను పర్యవేక్షిస్తూ జాప్యానికి ఆస్కారం లేకుండా చూస్తున్నారు. ఏప్రిల్ చివరి కల్లా పనులు ముగించుకుని మేలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది.
డివిజన్ పరిధిలోని చెరువులను సుందరీకరించి ప్రజలకు అందించేందుకు తగు కృషి చేస్తున్నాం. అలీ తలాబ్ చెరువును రూ.1.83 కోట్ల నిధులతో అభివృద్ధి పరుస్తున్నాం. చెరువు కట్ట పటిష్టత, వాకింగ్ ట్రాక్, దెబ్బతిన్న చోట్ల ఫెన్సింగ్, వరద కాలువ నిర్మాణం, డ్రైనేజీ నీటికి డైవర్షన్ ఛానళ్ల నిర్మాణం వంటివి చేపడుతున్నాం. 1.6 కిలో మీటర్ల మేర వాకింగ్ ట్రాక్ చెరువు చుట్టూ నిర్మాణం అవుతున్నది. పూర్తవగానే బయోడైవర్సిటీ విభాగం ద్వారా పచ్చని మొక్కలు నాటి పరిసరాలను ఆహ్లాదంగా తీర్చిదిద్దుతాం. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవటమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం.
– నార్నె శ్రీనివాస్‌రావు, కార్పొరేటర్,హైదర్‌నగర్ డివిజన్