సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పిన ప్రభుత్వం.. ప్రస్తుతం లబ్ధిదారుల కరెంట్ వాడకాన్ని చూపిస్తూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకుంటున్నది. గృహజ్యోతి పథకంలో లబ్ధిపొందుతున్న వారికి జీరో బిల్లు బదులు వేలల్లో బిల్లు రావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ముందస్తుగా వచ్చి బిల్లులు తీయడమే కాకుండా తాము బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
యూసుఫ్‌గూడ కార్మికనగర్‌కు చెందిన ఓ వ్యక్తికి మార్చ్ నెల కరెంట్ బిల్లు రూ.1048 వచ్చింది. అతడు గృహజ్యోతి లబ్ధిదారుడు కాగా మార్చ్ 10 నుంచి ఏప్రిల్ 4వరకు 25 రోజులకు 174 యూనిట్ల కరెంట్ వాడకం జరగగా, యావరేజ్ నెలవారీ యూనిట్లు 216గా లెక్కవేసి అతనికి బిల్లు వేశారు. ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్‌లో 10,03,286 మంది జీరో బిల్లు వాడుతున్నారని అధికారులు చెబుతున్నారు. వీరు ప్రతీ నెలా 100 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం జరుగుతున్నదని తెలిపారు. వేసవికి ముందు విద్యుత్ వినియోగం కొంత తక్కువగానే ఉన్నప్పటికీ ఇప్పుడు విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది.
అయితే లోడ్ పెరుగుతున్నదని, భారం ఎక్కువ కావడంతో జీరో బిల్లులకు అధికారులు చెక్ పెడుతున్నారు. మరోవైపు గత నెలలో మీటర్ రీడర్లు సమ్మె చేశారు. కరెంట్ బిల్లులను ఆలస్యంగా తీయడంతో దాదాపు మార్చ్ పది వరకు ఏ సర్కిల్లోనూ బిల్లులు మంజూరీ చేయలేదు. దీంతో మార్చ్ నెలలో 10వ తేదీ బిల్లు తీసినట్లుగా రాగా ఈనెల అంటే ఏప్రిల్‌లో 4 నుంచి 5వ తేదీ వరకు బిల్లులు తీశారు. అంటే కేవలం 25 రోజుల బిల్లులు మాత్రమే తీస్తుండడంతో నెలవారీ బిల్లు కోసం యావరేజ్ నెలవారీ యూనిట్లను లెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం పడుతోంది. ముఖ్యంగా గృహజ్యోతి లబ్ధిదారులకు ఈ యావరేజ్ యూనిట్ల సంఖ్య షాక్ ఇస్తున్నది.