కీసర, జూలై 27: నా జీవితాంతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించనని మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం కీసరగుట్టలో సంతోష్‌కుమార్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే చామకూర మల్లారెడితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఏడు వసంతాలు విజయవంతంగా ముందుకెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదవ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైందన్నారు.భారతదేశాన్ని పచ్చదనంతో నింపాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని.. ఒకరు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ విసరగా నేడు 20 కోట్లకు పైగా మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు.
సామాన్యుల నుంచి సినీ ప్రముఖలు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు ఇలా ప్రతి ఒక్కరు ఒక యజ్ఞంలా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారని తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో ఈ యజ్ఞంను ప్రారంభించామని, నా జీవితాంతం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. కీసరలో ఫారెస్ట్ ల్యాండ్‌ను దత్తత తీసుకొని దాని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. సంతన్న అంటేనే హరితహారం, సంతన్న అంటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్నారు. సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా కార్యక్రమాన్ని పార్లమెంట్లో కూడా ప్రశంశించారని మల్లారెడ్డి తెలిపారు.
స్వామి సేవలో మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు..
అనంతరం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామివారిని మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ, ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కీసర మాజీ సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, జవహర్‌నగర్ మాజీ మేయర్ కావ్య, దమ్మాయిగూడ మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రణీతగౌడ్, బీఆర్ఎస్ నేతలు నాయకపు వెంకటేశ్ ముదిరాజ్, గుర్రం శ్రీధర్‌రెడ్డి, రాగుల రమేశ్ ముదిరాజ్, తటాకం భానుశర్మ తదితరులు పాల్గొన్నారు.
జీఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
కీసరకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత గుర్రం శ్రీధర్‌రెడ్డి యువతలో నూతన ఉత్తేజాన్ని నింపడానికి క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జీఎస్ఆర్ ఆధ్వర్యంలో సెషన్-2 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ టోర్నమెంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. గుర్రం శ్రీధర్‌రెడ్డి చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు.