సిటీబ్యూరో, ఏప్రిల్ 26 ( నమస్తే తెలంగాణ ) : నేటి విద్యార్థులదే రేపటి భవిష్యత్తు. విద్యాసంస్థలు రేపటి పౌరులను తయారుచేసే విజ్ఞాన కేంద్రాలు. భావిభారత పౌరుల సర్వతోముఖాభివృద్ధి తరగతి గదుల్లోనే రూపుదిద్దుకోవాలి. కానీ ఆ విద్యా సంస్థలు లాభర్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. చీకటి గదులు, అనుమతి లేని భవనాలు, విలువల్లేని బోధన, అర్హత లేని టీచర్ల నియామకంతో విద్యార్థలను జ్ఞానానికి దూరంగా మర యంత్రాలుగా మార్చేస్తున్నాయి. వేసవి సెలవులు రాకముందరనే అడ్మిషన్ల దందా షురూ చేస్తున్నాయి.
నర్సరీ, ఎల్కేజీలకే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. గ్రేటర్లోని పాఠశాలల్లో ఎల్కేజీకి వసూలు చేస్తున్న ఫీజులు.. ఇంజినీరింగ్, మెడిసిన్, డెంటల్కాలేజీలు ఫీజుల కన్నా అధికంగా ఉన్నాయి. ఇంజినీరింగ్లో గరిష్ఠంగా అధికంగా రూ. 2.15 లక్షల ఫీజు ఉంటే.. ఓ పాఠశాలలో ప్రీ ప్రైమరీకి రూ. 2.10 లక్షలు వసూలు చేస్తున్నారు. ఫీజుల కట్టడిపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎలాంటి నియంత్రణ ఉండకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ప్రతీ ఏడాది అధిక ఫీజులపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తున్నా.. విద్యాశాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా అనుమతి లేని స్కూళ్లు నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
ఇంటర్నేషనల్స్పై పర్యవేక్షణేదీ?
అంతర్జాతీయ ప్రమాణాలు అని చెప్పుకొంటున్న పాఠశాలల్లో సైతం ప్రమాణాలు సాధారణ పాఠశాలల మాదిరిగానే ఉంటున్నాయని విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో ఒకటో తరగతి నుంచి 10 వ తరగతి వరకు 773 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. మరో 3,500 వరకు ప్రయివేట్ , కార్పొరేట్ పాఠశాలలున్నాయి. చాలా విద్యాసంస్థలు ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరుతో రాజ్యమేలుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకున్నా దర్జాగా బోర్డులు తగిలించుకొని దందా చేస్తున్నాయి. సీఐఎస్(కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్) గుర్తింపు ఉన్న పాఠశాలలు మాత్రమే ఇంటర్నేషనల్ బోర్డులు తగిలించుకోవాలి. ఈ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న పాఠశాలలను ఆ సంస్థ అన్ని విధాలుగా పరిశీలించి ఆమోదం తెలుపుతుంది. గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, బోధన సామగ్రిలాంటి 25 అంశాలను పరిగణలోకి తీసుకుని గ్రేడింగ్స్ జారీ చేస్తుంది. కానీ నగరంలోని చాలా పాఠశాలలు గుర్తింపులేకున్నా ట్యాగ్ తగలించుకుని విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి.
మౌనమేల..?
పాఠశాల స్థాపించాలంటే విద్యాశాఖ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మద్యం దుఖాణాలు, ప్రార్ధన మందిరాలకు పాఠశాల దూరంగా ఉండాలి. 24 శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) తీసుకోవాలి. భవన రిజిస్ట్రేషన్, అగ్ని మాపకం తప్పనిసరి. అయితే నగరంలో చాలా పాఠశాలలను కేవలం లాభార్జన మీదనే నెలకొల్పుతున్నారు. హైదరాబాద్లో మొత్తం 2374 ప్రయివేట్ స్కూళ్లు ఉంటే ఇందులో 1897 పాఠశాలలకే గుర్తింపు ఉంది. ఇందులో 477 పాఠశాలలకు గుర్తింపు లేదు. ఈ విషయం విద్యా శాఖాధికాలకు దృష్టిలో ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇటీవల లంగర్ హౌజ్లో ఉన్న ఆర్కిడ్జ్ పాఠశాలను అనుమతి లేదని విద్యాశాఖాధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో చదివే 800 మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. ఇలాంటి అనుమతి లేని పాఠశాలలను రద్దు చేయాల్సిన డీఈఓ, డిప్యూటీ ఈఓఎస్లు, డిప్యూటీ ఐఓఎస్లు మౌనం ఆ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. మరో పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి వచ్చింది. రిట్జ్ పాఠశాలను సైతం అనుమతి లేని భవనంలో కొనసాగిస్తే విద్యార్థి సంఘాల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్ కోర్సులను పూర్తి చేయని వారిని ఉపాధ్యాయులుగా నియమించుకుని పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారని ఫిర్యాదులు అందినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. .