ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని ఓయూ, జేఎన్టీయూ, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ వంటి యూనివర్సిటీలలో బీటెక్ బయోటెక్నాలజీ రెగ్యులర్ కోర్సును 2025-26 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని ఓయూ అధ్యాపకుడు డాక్టర్ అడ్డగట్ల రవీందర్ డిమాండ్ చేశారు. కోవిడ్ లాంటి ఎన్నో మహమ్మారిలను నియంత్రించే వ్యాక్సిన్‌ను కనుగొన్నది బయోటెక్నాలజీ నిపుణులేనని గుర్తు చేశారు.
బీటెక్‌లో బయోటెక్నాలజీ కోర్సు ప్రవేశపెట్టినట్లయితే ఎంసెట్ మెరిట్ ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించే విద్యార్థులకు సువర్ణ అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. కొవిడ్ పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా బ యోటెక్నాలజీ రంగానికి ప్రాధాన్యం పెరిగిందని, ఈ రంగంలో నిపుణుల కొరతను అధిగమించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని చెప్పారు.
బైపీసీ విద్యార్థులకూ అవకాశం కల్పించాలి..
ఎంపీసీ విద్యార్థులు ఐఐటీ, జేఈఈ పరీక్ష ద్వారా ఐఐటీ, ఎన్ఐటీలలో ప్రవే శం పొందవచ్చని వివరించారు. అయితే బైపీసీ విద్యార్థులు ఆకోర్సులో చేరెందుకు అవకాశం లేదని.. దాంతో వారు పక్క రాష్ర్టాలకు వెళ్లి లక్షల ఖర్చుతో బీటెక్ చదువుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బైపీసీ విద్యార్థులకు సైతం బీటెక్ బయోటెక్నాలజీలో చేరేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్రంలో ఇప్పటికే ప్రైవేట్ యూనివర్సిటీలలో బైపీసీ విద్యార్థులకు బీటెక్‌లో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.