సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం నాలుగో స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఇందులో ఏడు అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. నగర అభివృద్ధికి, ప్రజలకు ఉపయుక్తమైన పనులు చేపట్టడంతో పాటు కమిటీ సభ్యులు సహకరించాలని మేయర్ కోరారు.
కాగా, 4 లేన్ల బై డైరెక్షన్ ఎలివేటెడ్ కారిడార్ ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు ఎన్టీఆర్ స్టేడియం, వీఎస్టీ మెయిన్ రోడ్ అశోక్‌నగర్ జంక్షన్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా ఫ్లై ఓవర్ పనులు, బాగ్‌లింగంపల్లి జంక్షన్ నుంచి 3 లేన్ల బై డైరెక్షన్ ఎలివేటెడ్ కారిడార్ రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వీఎస్టీ మీదుగా సెకండ్ లెవల్ ఇండియన్ హు మే పైప్ కో. లిమిటెడ్, వజీర్ సుల్తానా టొబాకో వరకు రోడ్డు పనులకు సంబంధించి రివైజ్డ్ అంచనా వ్యయం రూ. 565 కోట్లు ప్రతిపాదించారు. అందులో రూ. 426 కోట్లు ఖర్చు చేశారు.
గతంలో మంజూరు చేసిన రూ. 139 కోట్లు చెల్లించేందుకు పరిపాలన అనుమతుల మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపింది. స్లమ్ ఏరియాలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కల్పించి, శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో సీఎస్ఆర్ కింద డాక్టర్ విజయ్‌కుమార్ దాట్ల ఫౌండేషన్‌కు ఏడాది కాలానికి బొల్లారంలోని మోడల్ మార్కెట్ బిల్డింగ్‌కు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకునేందుకు కూకట్పల్లి జోనల్ కమిషనర్‌కు అనుమతి ఇస్తూ కమిటీ ఆమోదించింది.
డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించిన లబ్ధిదారుల వివరాలు, అప్లోడ్ చేసిన మెస్సర్స్ ఈ-డేటా సొల్యూషన్ ఏజెన్సీకి చెల్లించాల్సిన రూ.12.38 లక్షలకు కమిటీ ఆమోదించింది శేరిలింగంపల్లి జోన్ మియర్ గురునాథ్ చెరువును సీఎస్ఆర్ కింద అభివృద్ధి నవీకరణ కోసం మల్లిగా వల్ సంస్థకు ఆరు నెలల కాలానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఎంవోయూ చేసేందుకు, జీహెచ్ఎంసీకి సంబంధించిన 15 ఐటీ మాడ్యుల్స్ నిర్వహణ అగ్రీమెంట్‌ను (మూడేండ్లుకు) నవంబర్ 23 నుంచి అక్టోబర్ 2026 వరకు రెన్యువల్ చేస్తూ రూ.9.88కోట్లకు పరిపాలనా అనుమతికి కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు.