శేరిలింగంపల్లి, జనవరి 22 : గచ్చిబౌలి(Gachibowli) పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటి స్పాట్ ఎఫ్ఐఆర్(First spot FIR) నమోదు చేశారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని జీపీఆర్ఏ క్వార్టర్స్ లో దొంగతనం జరిగినట్లు సైబరాబాద్ సోషల్ మీడియా సెల్ ద్వారా సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల వివరాలు సేకరించి స్పాట్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్ లో నివాసం ఉండే జీ చందన, స్థానికంగా ఐటీ ఉద్యోగం చేస్తుంది. సంక్రాంతి పండగకు స్నేహితులతో కలిసి ఈ నెల 11న ఊరెళ్లింది.
తిరిగి 19వ తేదీన వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో పాటు ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడాన్ని గుర్తించి, వెంటనే సైబరాబాద్ సోషల్ మీడియా సెల్ కు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే గచ్చిబౌలి డీఎస్ఐ నర్సింలు అక్కడికి చేరుకుని పూర్తి వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా దొంగతనానికి వచ్చిన వ్యక్తులు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారని, లోపల దొంగతనానికి విఫల యత్నం చేసినట్లు గుర్తించారు. కాగా ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులు పోనట్లు ఫిర్యాదుదారు తెలిపిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.