సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. కుక్క కాటు ప్రమాదాల శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా అంబర్పేట్ ప్రమాదంలో మరణించిన చిన్నారి కుటుంబానికి మేయర్ తరుఫున రూ. 2 లక్షలతో పాటు తన నెలవారీ గౌరవ వేతనం రూ. 62,500, డిప్యూటీ మేయర్ ఒక నెల గౌరవ వేతనం రూ. 32,500తో పాటు ముందుకొచ్చిన 17 మంది కార్పొరేటర్లు ఒక్కొక్కరు తమ నెలవారీ గౌరవ వేతనం రూ.7800 చొప్పున మొత్తం రూ.1,32,600లను అందించేందుకు తీర్మానించారు. వాటితో పాటు జీహెచ్ఎంసీ తరఫున రూ. 6 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మొత్తం రూ.10,30,100 ఆర్థిక సహాయాన్ని అంబర్‌పేట బాలుడు ప్రదీప్ కుటుంబానికి అందజేయనున్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు, వివిధ పార్టీలకు చెందిన ముగ్గురు చొప్పున కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వెటర్నరీ అధికారులతో మేయర్ , డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి, కమిషనర్ డి.ఎస్ లోకేశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీధి కుక్కల ప్రమాదాల శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక కమిటీ, అంబర్‌పేట బాలుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
నూతన పరిజ్ఞానంతో స్టెరిలైజేషన్
వీధికుకల ప్రమాదాలను నివారించడం అందరి బాధ్యత అని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, జంతు ప్రేమికులు ముందుకు రావాలని కోరారు. వీధికుకల నివారణకు సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అఖిలపక్ష కమిటీని వేయనున్నట్లు మేయర్ తెలిపారు. ఇందుకు ఆయా పార్టీల నుంచి ఇద్దరి పేర్లను ప్రతిపాదించాలని తెలిపారు. కుకలను పట్టుకోవడానికి ప్రస్తుతం ఉన్న 30 వాహనాలకు అదనంగా మరో 20 వాహనాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒకొక వాహనానికి ఐదుగురు సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తామన్నారు. ప్రతి రోజు జరుగుతున్న 150 స్టెరిలైజేషన్ ప్రక్రియను ఇక నుంచి నూతన పరిజ్ఞానంతో 400 నుంచి 450 కుకలకు స్టెరిలైజేషన్ చేయడానికి చర్యలు తీసుకుంటామని మేయర్ పేర్కొన్నారు. కార్పొరేటర్‌కు తెలియకుండా అవగాహన కార్యక్రమాలు చేయవద్దని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కుకలను పట్టుకోవడానికి వెళ్లిన సందర్భంలో ఆ ప్రాంత కార్పొరేటర్‌ను సైతం భాగస్వామ్యం చేస్తున్నామని, సంబంధిత డివిజన్ కార్పొరేటర్ సంతకం, ధృవీకరణ తప్పనిసరి చేస్తున్నట్లు శాశ్వత పరిషారం దిశగా మేయర్ పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం కుకల గణన చేస్తాం: లోకేశ్‌కుమార్
కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఐదు యానిమల్ కేర్ సెంటర్లను సందర్శించాలని కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ అన్నారు. ప్రతి సంవత్సరం కుకల గణన చేస్తామని తెలిపారు. కుకల బెడదే కాకుండా కొన్ని ప్రాంతాల్లో కోతుల బెడదకు కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కుకలను పట్టే వాహనాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. వీధికుకలను పెంచుకోవడానికి ముందుకు వచ్చిన వారికి ఫ్రీ లైసెన్సు, రిజిస్ట్రేషన్ చేస్తామని… వాటికి చికిత్సను కూడా త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.