సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఆగడాలు మితిమీరుతున్నాయి. దోమల నివారణ కోసం రాత్రింబవళ్లు కష్టపడే ఎంటమాలజీ కార్మికుల పొట్ట గొడుతూ, వారి శ్రమను ఏజెన్సీలు దోచుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కార్మికులకు చెల్లించాల్సిన వేతనాల్లో భారీగా కోత విధిస్తూ లక్షల రూపాయలు స్వాహా చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంటమాలజీ విభాగంలో పనిచేసే ప్రతి కార్మికుడికి నెలకు రూ. 20,930 వేతనం అందాలి.
జీహెచ్ఎంసీ అధికారులు ప్రతినెలా కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఈ మొత్తాన్ని సక్రమంగానే చెల్లిసున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కార్మికులకు అందుతున్నది మాత్రం కేవలం రూ. 9,000 మాత్రమే. అంటే ఒకో కార్మికుడి నుంచి నెలకు సుమారు రూ. 12,000 వరకు ఏజెన్సీలు మింగేస్తున్నాయి. సుమారు 200 మంది కార్మికులు ఈ దోపిడీకి గురవుతూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బాధిత కార్మికులంతా కమిషనర్‌ను కలిసి జరుగుతున్న దోపిడీపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు కార్మికులు చెబుతున్నారు.
‘లెస్’ టెండర్ల సాకుతో నిలువు దోపిడీ..
తమ అక్రమాలను ప్రశ్నిస్తున్న కార్మికులకు ఏజెన్సీలు వితండవాదం వినిపిస్తున్నాయి. ‘మేము టెండర్లను లెస్ (తకువ ధర)కు దకించుకున్నాం.. అందుకే మీకు తకువ ఇస్తున్నాం’ అంటూ బుకాయిస్తున్నాయి. వాస్తవానికి టెండర్ దకించుకునేటప్పుడు ఏజెన్సీలు కోట్ చేసిన ధరకు, కార్మికుల కనీస వేతనానికి సంబంధం ఉండకూడదన్న నిబంధన ఉన్నా, వాటిని తుంగలో తొక్కుతుండడం గమనార్హం. తమకు రావాల్సిన పూర్తి జీతం అడిగిన కార్మికులను ఏజెన్సీ నిర్వాహకులు బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నోరు తెరిస్తే చాలు, ‘రేపటి నుంచి పనికి రావద్దు’ అంటూ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే కొందరు కార్మికులను అకారణంగా తొలగించడంతో, మిగిలిన వారు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక భయం భయంగా కాలం వెళ్లదీస్తుండగా, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ అక్రమ దోపిడీని అరికట్టాలని తమకు న్యాయం చేయాలని కార్మికులు వేడుకుంటున్నారు.