Runa Mafi | మేడ్చల్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ): గ్రీవెన్స్ సెల్ల ఏర్పాటుతో రైతులకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. రైతులు రుణమాఫీని పొందే విధంగా ఉపయోగపడుతుందని ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని రుణమాఫీ రాని రైతులు మండిపడుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా బౌరంపేట్, దూలపల్లి, దబిల్పూర్, శామీర్‌పేట్, కీసర, మేడ్చల్, అల్వాల్, పూడూర్, ఘట్కేసర్లలో సహకార సంఘాలు ఉన్నాయి.
సహకార సంఘాల పరిధిలోని రైతులకు సంబంధించి రుణమాఫీ పొందని రైతుల కోసం సమాచారం అందించేందుకు 27 గ్రీవెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో ఎంత ఆశతో రైతులు 262 మంది ఫిర్యాదు చేసినా రుణమాఫీ వర్తింపు జరగలేదు. జిల్లా వ్యాప్తంగా మొదటి, రెండో విడతలో 3,091 మంది రైతులకు మాత్రమే రూ.17 కోట్లను రుణమాఫీ చేయడంతో వేలాది సంఖ్యలో అర్హులైన రైతులకు రుణమాఫీ దక్కకుండా పోయింది. వేలాది సంఖ్యలో రుణమాఫీ కోసం గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కొన్నింటివి మాత్రమే సమాచారం అందించి, మిగతా వేలాది సంఖ్యలో ఉన్న ఫిర్యాదులను నిరాకరించి తిప్పి పంపుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది.
సమాచారం మాకేందుకు రుణమాఫీ చేయండి
రుణమాఫీ పథకం వర్తింపు కోసం వెళ్లే సమాచారం ఇచ్చి వెళ్లమంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. గ్రీవెన్స్ సెల్లో వ్యవసాయ శాఖ అధికారులు తమ ఆధార్ కార్డును చూసి రేషన్ కార్డులలో కుటుంబ సభ్యులు వివరాలు పూర్తిగా లేవని, ఐటీ కట్టిన రైతులు ఉన్నందున రుణమాఫీ రాలేదని, కొందరికేమో మీ రుణమాఫీ ప్రాసెస్‌లో ఉందంటూ చెప్పి పంపిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సమాచారం కోసం రావడం లేదని తమకు రుణమాఫీ చేసేలా చూడాలని రైతులు అధికారులకు విన్నవిస్తున్నా తమ వద్ద ఇదే సమాచారం ఉందంటూ తిప్పి పంపిస్తున్నట్లు రైతులు తెలిపారు.
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు అన్ని సాకులు చూయిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. రుణమాఫీ పథకం వర్తింపుపై జిల్లా వ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పవచ్చు. రైతులు మాత్రం గ్రీవెన్ సెల్స్ చుట్టూ తిరుగుతూ రుణమాఫీ కోసం ఎదురూ చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 17 వేల మంది పైచిలుకు రైతులు రుణమాఫీ పొందే రైతులుంటే.., రుణమాఫీ వచ్చింది మాత్రం 3,091 మంది రైతులకు మాత్రమే.