హిమాయత్ నగర్, మే 21: చత్తీస్‌గఢ్, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని మాడ్ సమీపంలో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావును ఎన్కౌంటర్ చేయడంపై తెలంగాణ పౌర హక్కుల సంఘం విచారణ వ్యక్తం చేసింది. బుధవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి భవానీ మాట్లాడారు. బరువైన గుండెలతో నిండుకున్న సందర్భంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావుతో పాటు 27 మందిని.. కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలు మట్టుపెట్టాయని.. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌ను ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. శభాష్ అని పొగడటం శోచనీయమన్నారు. పౌర సమాజం మొత్తం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నా చర్చలు జరపకుండా ఆయుధాలతో సమాధానం చెప్తూ 550 మందిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మావోయిస్టుల విషయంలో కూడా కాల్పులు ఆపాలని అమెరికా అధ్యక్షుడుచెప్తేనే కేంద్ర ప్రభుత్వం విటుందా అని ప్రశ్నించారు. శత్రు దేశంతో యుద్ధాన్ని ఆపిన ప్రభుత్వం..పౌర సమాజం మాటలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించడంతో పాటు భద్రతాబలగాలపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చత్తీస్‌గఢ్ అడవులు శవాల గుట్టలుగా మారాయని.. తక్షణమే ఆపరేషన్ కాగార్ను నిలిపివేయాలన్నారు.