సిటీబ్యూరో, జూన్ 7(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు భూమి చిక్కులు తొలగడం లేదు. ఓవైపు రక్షణ శాఖ భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా.. పరిహారం తేలకపోవడంతో ఇంకా చర్చలు సాగుతున్నాయి. మరోవైపు ప్రైవేటు భూ బాధితులు కూడా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ప్రధాన డిమాండ్లను తమ ముందు ఉంచుతున్నారు. ముఖ్యంగా 200 ఫీట్ల వెడల్పు మేర ఆస్తులను సేకరించడం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, భూ పరిహారం విషయంలోనూ ఏటూ తేలడం లేదు. మూడింతలు ఇస్తే గానీ ప్రాజెక్టుకు ఆమోదించాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
మొదటి నుంచి అభ్యంతరం
ఎలివేటెడ్ కారిడార్ విషయంలో ఒక్క అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారుతున్నది. ముఖ్యంగా భూసేకరణ, పరిహారం, ప్రాజెక్టు వెడల్పు విషయంలో 18 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కోసం ఆందోళన చేస్తూనే ఉన్నారు. జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు, ప్యారడైజ్ నుంచి సుచిత్ర మార్గంలో నిర్మించనున్న ఎలివేటెడ్ కోసం విలువైన భూములను కోల్పోతున్నామని మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం బాధితుల ఆవేదనను పట్టించుకోవడం లేదు. దీంతోనే భూసేకరణకు ముందుకు రావాలని కోరినా బాధితులు ఆసక్తి చూపకుండా.. ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు జరిగిన గ్రామ సభలన్నింటిలోనూ నిరసన వ్యక్తం చేస్తూ తాము ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చేది లేదంటున్నారు.
డిఫెన్స్ తరహాలో పరిహారం
ఈ రెండు ప్రాజెక్టుల కోసం డిఫెన్స్ శాఖ 160 ఎకరాలకు పైగా భూమిని కోల్పోతున్నది. దీనికి పరిహారం మూడింతలు ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉంది. ఇదే తరహాలో ప్రైవేటు ఆస్తుల విషయంలోనూ పరిహారం చెల్లించాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఇదే గనుక జరిగితే ప్రాజెక్టుతో తాము కోల్పోతున్న జీవనోపాధికి భరోసానిచ్చేలా పరిహారాన్ని కోరుతున్నారు. తాము కోల్పోతున్న భూమికి మూడింతలు భూమిని అన్ని వసతులు, అభివృద్ధికి ఆస్కారం ఉండే ప్రాంతాల్లో పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
అదేవిధంగా గతంలో ఉప్పల్ రోడ్ల విస్తరణ సమయంలోనూ ఇదే తరహాలో వచ్చిన సమస్యను పరిష్కరించిన యంత్రాంగం.. బాధితులతో చర్చలు జరిపి ప్రాజెక్టు కోసం భూములు తీసుకుందని గుర్తు చేస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్టు కోసం రాజీవ్ రహదారి వెంబడి ఉన్న వందలాది ఇంటి యాజమానులను రోడ్డున పడేలా ప్రభుత్వం వ్యవహారిస్తుందని వాపోతున్నారు. కనీసం రోడ్డు వెడల్పు 200 ఫీట్ల నుంచి 100 ఫీట్లకు తగ్గించిన తమకు ఆస్తులకు కొంత భరోసా ఉంటుందని వాపోతున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్చలు చేయకుండానే భూములు లాగేసుకునేలా వ్యవహారిస్తోంది. కనీసం కోల్పోతున్న భూములకు పరిహారాన్ని మూడింతలు చేయాలని డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
నేడు భేటీ కానున్న జేఏసీ
ఓవైపు ఎలివేటెడ్ కారిడార్ విషయంలో ప్రభుత్వం భూసేకరణ చేయకుండానే… ఏకపక్షంగా ప్రకటనలు చేస్తోంది. మరో వైపు భూములు కోల్పోతున్న వారికి ఎలాంటి భరోసా ఇవ్వకుండానే భూ సేకరణ కోసం గ్రామ సభలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు నిర్వహించిన గ్రామ సభలన్నింటిని తాము వ్యతిరేకించామని, ప్రాజెక్టును అడ్డుకోవడం లేదని, తమ ఆస్తులు, జీవనోపాధికి భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని రాజీవ్ రహదారి జేఎసీ నాయకులు వాపోతున్నారు. దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ఇవాళ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తీసుకుని ఏకగ్రీవంగా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని జేఎసీ నాయకులు సతీష్ తెలిపారు.