సిటీబ్యూరో, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ప్రకటించిన ‘ఎర్లీబర్డ్ స్కీం’కు విశేష స్పందన లభిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెలాఖరు 30వ తేదీ నాటికి ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంటూ ఆఫర్‌ను ఈనెల 1వ తేదీన ప్రకటించింది. ఇందులో భాగంగానే గడిచిన 20 రోజులుగా దాదాపు 3.5 లక్షలకు పైగా ముందుకు వచ్చి ఆస్తిపన్ను చెల్లించారు. తద్వారా జీహెచ్ఎంసీ రూ.388.80 కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకున్నది.
మరో తొమ్మిది రోజుల్లో రూ.361.20కోట్ల ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఎర్లీబర్డ్ స్కీం ద్వారా ఏకంగా రూ. 741.35కోట్ల మేర ఆదాయం సమకూర్చుకోగా.. ఈ సారి రూ.750కోట్ల నిర్దేశిత లక్ష్యాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు ఆయా లక్ష్యాలను కచ్చితంగా చేరుకోవాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులను చార్మినార్ జోన్‌కు బదిలీ చేయబడుతుందంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ డీసీలకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో లక్ష్యాన్ని ఛేదించే దిశగా చర్యలను వేగిరం చేశారు.