సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ ): ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) పరిధిలో ఎట్టకేలకు ‘ ఈ -ఆఫీస్’కు గ్రహణం వీడింది. గత వారం రోజులుగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఈ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల అటు పాలనా యంత్రాంగం, ఇటు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొన్నారు. సర్వర్ సమస్యలు, సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేస్తున్నామనే సాకుతో అధికారులు కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి.
వారం రోజులు గడుస్తున్నా కనీసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకపోవడంతో ఒక్కో అధికారి వద్ద వందలాది సంఖ్యలో ఫైళ్లు పేరుకుపోవడం, ఇంటర్ననల్ ఫైల్స్ కదలిక లేకపోవడంతో ఏ విభాగానికి సంబంధించిన పనులు ఎకడ ఆగిపోయాయో తెలియని అయోమయ స్థితి ఏర్పడింది. పైస్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ఫైళ్ల అనుమతుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ‘సాఫ్ట్వేర్ అప్ డేట్ అవుతోంది.. రేపు రండి.. ఎల్లుండి రండి’ అంటూ సిబ్బంది పంపించడం ఒకింత పౌరులు అసహనం వ్యక్తం చేశారు. అయితే గురువారం నుంచి ఈ-ఆఫీస్లో నెలకొన్న స్తబ్ధతకు చిక్కుముడి వీడినా..ఫైళ్లకు మోక్షం కలుగుతుందో లేదో చూడాలి.