మేడ్చల్, మే 18 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, కేపీ. వివేకానంద్, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి సమస్యలపై గళమెత్తారు. వైద్య, విద్యశాఖ అధికారులు పూర్తిగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు వైద్యశాఖ తీరుపై మండిపడ్డారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, జిల్లా కలెక్టర్ మనుచౌదరి పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే వివేకానంద్
దుండిగల్, నిజాంపేట్, బాచుపల్లి, కైసర్నగర్లలో వేలాది సంఖ్యలో డబుల్ బెడ్రూం కాలనీలలో నివసించే వారికి సౌకర్యాలు కరువయ్యాయి. సీలింగ్, రూఫ్ లీకేజీల కారణంగా నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలోపు మరమ్మతులు చేపట్టాలి. అంగన్వాడీ కేంద్రాలతో పాటు బస్తీ దవాఖానను ప్రారంభించాలి.
రూ. 15 కోట్లు ఇవ్వాలి: ఎమ్మెల్యే మల్లారెడ్డి
రెండున్నర ఏండ్లుగా మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. నిధులు మంజురులో నిర్లక్ష్యం చేస్తున్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మూడు మున్సిపాలిటీలైన అలియాబాద్, ఎల్లంపేట్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలలో నిధులు లేవు. నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. మూడు మున్సిపాలిటీలకు రూ. 5 కోట్ల చొప్పున రూ. 15 కోట్లు నిధులను మంజూరు చేయాలి. నియోజకవర్గంలో ఉన్న క్రషర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెద్ద మొత్తంలో మేడ్చల్ నియోజకవర్గానికి కేటాయించాలి.

కనీస వసతులు లేవు
ఉప్పల్ ప్రభుత్వ దవాఖానలో కనీస వసతులు కరువయ్యాయి. దవాఖానలో ఉన్న సమస్యలను జిల్లా వైద్యాధికారి ఉమాగౌరి దృష్టికి తీసుకొచ్చినా స్పందించడం లేదు. వైద్యానికి వచ్చే రోగులకు సరిగా బెడ్లు ఉండటం లేదు. దవాఖానకు సంబంధించి ఏమైనా అవసరాలను తన దృష్టికి తీసుకరావాలని సూచించిన వైద్యాధికారి ఉమాగౌరి నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల మంజూరైనా ప్రభుత్వం స్థలం కేటాయించడం లేదు. ఉప్పల్-నారపల్లి కారిడార్ నిర్మాణ పనుల కారణంగా ఉప్పల్ రింగ్ రోడ్డు మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ రహదారులను మరమ్మతులు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలి.
-ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ప్రభుత్వ భూమి సర్వే చేయకపోవడంతో..
మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాలో ఉన్న 844 సర్వే నెంబర్లో గల 56 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వ భూమిని సర్వే చేయాలని ఎన్నిసార్లు అధికారులకు వివరించినా సర్వే చేయడం లేదు. సర్వే చేయకపోవడంతో ప్రభు త్వ భూమి కబ్జాల పాలవుతున్నది. మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ దవాఖానలు రెండు మంజూ రై నిధులు ఉన్న ప్రభుత్వ భూమి లేకపోవడంతో పనులు ప్రారంభం కావడం లేదు. నవోదయ పాఠశాలకు అవసరమయ్యే ప్రభుత్వ భూమిని 844 సర్వే నెంబర్ భూమిలో కేటాయించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.
-మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
విద్యాశాఖ నిర్లక్ష్యం
కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలకు మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిన ఇప్పటి వరకు విద్యాశాఖ ఆ భూమిని తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంది. విద్యాశాఖ తీసుకోకపోవడంతో అ భూమిని తిరిగి హౌసింగ్‌బోర్డు తీసుకోనేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. కూకట్పల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.
-కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు