Ration Cards | మేడ్చల్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : రేషన్ కార్డుల జారీలో విచారణ పేరిట జాప్యం చేస్తున్నట్లు దరఖాస్తుదారుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులు ఎదురుచూపులు తప్పడం లేదు. జనవరి 26 న ఆరు పథకాల ప్రారంభంలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 6,800 మందికి మాత్రమే రేషన్ కార్డులను జారీ చేసిన విషయం విధితమే.
ఆనాటి నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డుల జారీకి లబ్ధిదారుల ఎంపికపై విచారణ జరుగుతుందని విచారణ అనంతరం రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పడం చూస్తుంటే కావాలనే రేషన్ కార్డుల జారీలో కాలయాపన చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులు ప్రజాప్రతినిధుల, అధికారులు చుట్టూ తిరుగుతున్నా కార్డుల జారీపై సరైన సమాదానం చెప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివిధ పథకాలకు రేషన్ కార్డులే ప్రమాణికం
వివిధ పథకాలకు రేషన్ కార్డులే ప్రమాణిక కావడంతో రేషన్ కార్డుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిరుపేదలకు రేషన్ కార్డులు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలను పొందలేకపోతున్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులను ముడి పెట్టడంతో కార్డులు లేని వారు అయోమయానికి గురవుతున్నారు. ఇండ్ల మంజూరు, పెన్షన్లు, తదితర పథకాలకు రేషన్‌కార్డులను ప్రమాణికంగా తీసుకోవడం మూలంగా కార్డులు లేని వారు ఇబ్బందులకు పడుతున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా లక్షా 22 వేల దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం రాగా ఇప్పటి వరకు 6 వేలా 8 వందల మందికి మాత్రమే కార్డులను జారీ చేశారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాలలో ఇప్పటి వరకు రేషన్ కార్డుల జారీ జరగలేదు. విచారణ ఎప్పుడు పూర్తి చేస్తారు రేషన్ కార్డులను ఎప్పుడు జారీ చేస్తారో తెలియని పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతరం పక్రియగా కొనసాగిస్తామని చెప్తున్నా ప్రభుత్వం చేసిన దరఖాస్తులకే కార్డులు అందించడం లేదని త్రీవ నిరాశకు గురవుతున్నారు.