నగరంలో కీలక ప్రాంతంగా, గేట్ వే ఆఫ్ తెలంగాణగా ఉన్న నార్త్ సిటీ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతోంది. బహుళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అప్పటి బీఆర్ఎస్ సర్కారు.. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. కానీ వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలం అవుతుంది. ప్రాజెక్టులను చేపట్టడం కంటే కనీసం వాటిని అమలు చేసే కార్యాచరణ లేక ఉన్న ప్రాజెక్టుల రూపురేఖలను మార్చివేస్తోంది. ఇలా అప్పటి సర్కారు రూపకల్పన చేసిన డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కాస్తా స్టీల్ బ్రిడ్జిగా మారుతుంది. దేశంలోనే రెండో డబుల్ డెక్కర్ కారిడార్‌గా నిలవాల్సి ఉంటే.. అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధిని ఆశ పల్లకిలో పడేస్తోంది.
– సిటీబ్యూరో, జనవరి 3(నమస్తే తెలంగాణ)
నార్త్ తెలంగాణ నుంచి నగరానికి వచ్చే వాహనదారులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో విస్తారమైన రోడ్లను అభివృద్ధి చేసే ప్రతిపాదనలు చేశారు. ఇందులో భాగంగానే నగరంలో రెండు డబుల్ డెక్కర్ ప్రాజెక్టులకు అనువుగా ఉండేలా ప్యారడైజ్ నుంచి సుచిత్ర మార్గంలో, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు రెండు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అందు కోసమే రక్షణ శాఖ భూముల కోసం కేంద్రంతో సంప్రదింపులు చేసిన అప్పటి సర్కారు..ప్రాజెక్టు డిజైన్లు ఖరారు చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు.. అంచనాలను తారుమారు చేస్తూ ప్రాజెక్టుల లక్ష్యాన్ని నీరుగార్చేలా వ్యవహారిస్తోంది. అల్వాల్ వద్ద టిమ్స్ వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వేదికగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రాజెక్టు రూపాన్ని మారుస్తూ తూట్లు పొడుస్తున్నారు.
ప్రతిపాదనలు తారుమారు…
వాస్తవానికి జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు, అదే విధంగా ప్యారడైజ్ సర్కిల్ నుంచి డెయిరీ ఫాం మార్గంలో మొత్తంగా 18 కిలోమీటర్ల పొడవైన రెండు ఎలివేటెడ్ కారిడార్లను డిజైన్ చేసింది. అయితే శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి… రెండు మార్గాల్లో మెట్రో వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపాదనలు, అనుమతులు, భూసేకరణలో ఎదురైన ఇబ్బందులతో ప్రాజెక్టును కాలాయాపన చేస్తుంది. జరుగుతున్న జాప్యాన్ని అనువుగా మార్చుకుని ప్రాజెక్టు డిజైన్లలో కూడా మార్పులు చేస్తోంది. దీంతో నగరానికి రావాల్సిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు లేకుండా చేస్తోంది.
డబుల్ డెక్కర్ ఆశలు గల్లంతు..
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే నగరంలో మెట్రో కారిడార్ ప్రాజెక్టును విస్తరించడానికి ప్రణాళికలతో హడావుడి చేసింది. అప్పటి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పట్టాలెక్కిన రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైలును రద్దు చేశారు. ఇక ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు జనసంచారమే లేని ప్రాంతాలకు కూడా మెట్రో రైలును తీసుకెళ్లే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో 30 లక్షల జనాభా ఉండే నార్త్ సిటీకి మెట్రో లేకుండానే తొలుత నగరంలో మెట్రో విస్తరణ డీపీఆర్‌ను కేంద్రానికి అందజేసింది.
కానీ స్థానికుల ఆందోళనలతో వెనక్కి తగ్గిన సర్కారు.. తూతూమంత్రంగానే డీపీఆర్ తయారు చేసి మెట్రో ఫేజ్-2లో పార్ట్ – బీగా 48కిలోమీటర్ల పొడవైన మెట్రో కోసం డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి అందజేసింది. ఇక్కడే ఆయన హెచ్ఎండీఏ ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ విషయంలో టెక్నికల్ సమస్యల పేరిట కొర్రీలు పెట్టారు. అక్కడితో ఈ ప్రాంతానికి డబుల్ డెక్కర్ ఆశలను గల్లంతు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఒకే పిల్లర్ మీద మెట్రో, రోడ్డు మార్గాలను నిర్వహించడం సాధ్యం కాదనీ తేల్చి ఎలివేటెడ్ కారిడార్ అసలు డిజైన్‌కు తూట్లు పొడిచారు. కనీసం ఎలివేటెడ్ కారిడార్ ఉంటుందనీ భావిస్తే.. మరోసారి టెక్నికల్, నిర్మాణ ఇబ్బందుల పేరిట మార్పులకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ సర్కారు ఉన్న డిజైన్లను మార్చివేసి చివరకు స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి సిద్ధమైతున్నది.
నార్త్ సిటీ అభివృద్ధి అంధకారం..
సుదీర్ఘ కాలంగా నార్త్ సిటీ అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ సర్కారును స్థానికులు నిలదీస్తున్నారు. మెట్రో ప్రాజెక్టులతోపాటు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం త్వరిగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందు కోసం సమస్యాత్మకంగా మారిన భూసేకరణ, ప్రాజెక్టు వెడల్పు అంశాలను తక్షణమే పరిష్కరించి నార్త్ సిటీ అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
స్టీల్ బ్రిడ్జికి ప్రతిపాదన..
నార్త్ తెలంగాణకు బాటిల్ నెక్‌గా మారిన నార్త్ సిటీ కారిడార్‌లో విశాలమైన రోడ్ల నిర్మాణంతో.. ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ఉదాహరణకు సిద్ధిపేట్ నుంచి శామీర్‌పేట్ వరకు గంటన్నరలోపు చేరుకుంటే..అక్కడి నుంచి జేబీఎస్ వరకు రావడానికి కనీసం గంటకు పైగా సమయం పడుతోంది. ట్రాఫిక్ ఇబ్బందులతో ఈ ప్రాంతం వాహనదారులకు నరకంగా మారింది. కానీ ప్రభుత్వం కొత్తగా స్టీల్ బ్రిడ్జి నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. కనీసం ప్రాజెక్టు ఆవశ్యకతను అర్థం చేసుకోకుండా, డిజైన్లు మార్చేందుకు సిద్ధమైంది. దానికి తగినట్లుగానే ప్రాజెక్టును చేపట్టేందుకు టెండర్లు కూడా ఖరారు చేసింది. కానీ ఇప్పటికీ ఆ ప్రాంతంలో ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు.