పేదలు నివాసముంటున్న బస్తీల జోలికి వెళ్లం. ఇప్పటికే ఇండ్లు కట్టుకొని స్థిరపడ్డ వారి ఇండ్లను కూల్చం. కొత్తగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిపైనే చర్యలు తీసుకుంటాం.
– సీఎం రేవంత్‌రెడ్డి
కట్టుకున్న ఇల్లు కూలిపోతుందనే భయం.. చిన్నపిల్లల భవిష్యత్ ఏమవుతుందోననే ఆందోళన.. వృద్ధాప్యంలో తలదాచుకునే నీడ కూడా లేకుండా పోతుందేమోనన్న కన్నీటి వేదన..ఈ భావోద్వేగాల మధ్య బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తా బస్తీవాసులు శుక్రవారం రోడ్డెక్కారు. హైడ్రా పేరుతో దశాబ్దాలుగా నివసిస్తున్న తమ ఇండ్లను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ.. మహిళలు, వృద్ధులు, చిన్నారులతో కలిసి నెక్లెస్‌రోడ్ ఎంఎంటీఎస్ స్టేషన్ సమీపంలో భారీ ధర్నా నిర్వహించారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని ‘రేవంత్ రెడ్డి డౌన్ డౌన్.. బుల్డోజర్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ.. బుల్డోజర్లు వస్తే.. ముందుగా మా ప్రాణాలనే తీసుకోవాలి..ఆ తర్వాతే మా ఇళ్లను కూల్చాలంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల జోలికి వెళ్లబోమన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలోనే తాజాగా నెక్లెస్ రోడ్డులోని బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తా వంటి పేదల బస్తీలపైకి
బుల్డోజర్లను ఎక్కుపెట్టేందుకు సిద్ధమై..ఖాళీ చేయాలంటూ.. ప్రభుత్వం నుంచి నోటీసులు జారీ కావడం గమనార్హం.
సిటీబ్యూరో, జూలై 10: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లోని పేద ప్రజలు వణికిపోతున్నారు. బుల్డోజర్ ఎప్పుడు వచ్చి తమ గూడును కూల్చేస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఏండ్ల తరబడిగా నివాసముంటున్న తమ ఇండ్లను నేలమట్టం చేసి నిర్వాసితులను చేస్తారేమోనని బిక్కుబిక్కుమంటూ.. కాలం వెల్ల్లదీస్తున్నారు. పేదల ఇండ్లను కూల్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎక్కడ నిరుపేదలు, దినసరి కూలీలు నివాసముండే బస్తీ కనిపిస్తే.. అక్కడ బుల్డోజర్ వాలిపోతున్నది. కనీస సమాచారం లేకుండా.. తమ వస్తువులను సైతం తీసుకోనీయకుండా ఆగమేఘాల మీద బస్తీలను నేలమట్టం చేస్తున్నారు.
చెరువుల పరిరక్షణ పేరిట ఆయా ప్రాంతాల్లో అన్ని అనుమతులతో ఏండ్ల తరబడిగా ఉంటున్న బస్తీలను రోడ్డున పడేశారు. మూసీ సుందరీకరణ పేరిట దశాబ్దాల కాలం నుంచి నివాసముంటున్న హైదరాబాద్ మూలవాసుల ఇండ్లను పెకిలించివేశారు. రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్న వారి ఇండ్లను కూల్చి జీవనోపాధి లేకుండా చేశారు. ఇలా నిత్యం గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట పేదల ఇండ్ల మీదకు కాంగ్రెస్ బుల్డోజర్ వెళ్తూనే ఉంది. తాజాగా నెక్లెస్‌రోడ్‌లోని బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తా బస్తీలను ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో ఎప్పుడు బుల్డోజర్ తమ ఇండ్లపైకి వచ్చి కూలుస్తుందోనని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ఉలిక్కిపడ్డ బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తా
ఇండ్లను ఖాళీ చేయాలని ప్రభుత్వం నుంచి నోటీసులు రావడంతో బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తా ఉలిక్కిపడ్డాయి. ఏండ్ల తరబడిగా అన్ని పన్నులు కడుతూ నివసిస్తున్న తమ ఇండ్లను కూలుస్తామని ప్రకటించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ ఇండ్ల కూల్చివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ శుక్రవారం నెక్లెస్‌రోడ్ ఎంఎంటీఎస్ స్టేషన్ రోడ్డులో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పెద్దల విల్లాల కోసం రోడ్డు విస్తరణ పేరుతో పేదల బతుకులను రోడ్డు పడేయాలని చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో రెండు బస్తీలకు చెందిన ప్రజలు వందలాదిగా వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఆయా బస్తీల ప్రజలు పిల్లలు, పెద్దలు, వృద్ధులను తీసుకొని తమ ఇండ్లను కాపాడుకునేందుకు రోడ్కెక్కారు. ప్లకార్డులు పట్టుకొని రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, బుల్డోజర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా నినాదాలతో దద్దరిల్లింది. బస్తీల వాసులు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా… అది ప్రభుత్వ పెద్దల నిర్ణయమని, తమ చేతుల్లో ఏమి లేదంటూ.. అధికారులు బుకాయిస్తున్నారని ఆరోపించారు. తమకు వేరే చోట్ల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామంటున్నారని, తమకు అలాంటి ఇళ్లు ఏమి అవసరం లేదని, ఉన్న ప్రాంతంలోనే ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పించాలని, తమ ఇండ్లు కూల్చివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బస్తీవాసులు స్పష్టం చేశారు.
రోడ్డు విస్తరణ పేరుతో ఇండ్లను కూలుస్తారా?
రోడ్డు విస్తరణ చేపడుతున్నామని, తక్షణమే వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో కూల్చివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. వందలాది కుటుంబాలు సుమారు 50 సంవత్సరాలుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. క్రమం తప్పకుండా ఆస్తి, నీటి పన్నులు, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. మరికొందరు అప్పులు చేసి మరీ ఇండ్లను కట్టుకున్నారు. వాస్తవానికి ఎఫ్టీఎల్ చుట్టూ పక్కల అనేక నిర్మాణాలు ఉన్నాయని, కానీ కావాలని బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తాలను కూల్చివేత మ్యాప్‌లలో చేర్చారని వాపోతున్నారు. అధికార పార్టీకి చెందిన వారి విల్లాలకు దారి వేసేందుకే రోడ్డు విస్తరణ, కూల్చివేతల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.
ఇండ్లు కూలిస్తే ఎక్కడికెళ్లాలి?
మూడు తరాలుగా ఇక్కడే స్థిరపడ్డాం.. మాకు ఉన్న ఏకైక జీవనాధారం, నిలువ నీడ కల్పించే ఇంటిని కూల్చివేయాలని ప్రభుత్వం చెబుతున్నది. నాకు కండ్లు కనిపించవు. వయ సు పైబడింది. నా కుటుంబమే నన్ను చూసుకోవాలి. అధికారులు ఇండ్ల చుట్టూ చక్కర్లు కొడుతూ మార్కింగ్ చేస్తున్నారు. కుందన్‌బాగ్‌లో పెద్ద పెద్ద విల్లాలు కడుతున్నారు. దాని సాకులో తమ పేద బస్తీలను కూల్చివేయాలని ప్రభుత్వ కుట్ర చేస్తున్నారు. ఏండ్ల తరబడిగా ఇక్కడే ఉంటున్నాం.
-అస్లాం బేగ్, ఎంఎస్ మక్తా
నోటీసులు మేమివ్వలేదు.. ఆందోళన చేస్తే కేసులు
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా నివాసితులకు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. హైడ్రా పేరు చెప్పి ఆందోళన చేస్తే కేసులు పెడతామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఆయా ప్రాంతాలను సందర్శించారు. స్థానికులతో నేరుగా మాట్లాడారు. హైడ్రా ఏర్పాటుకు ముందే ఉన్న నివాసాల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ స్పష్టం చేశారు.
రైల్వే ట్రాక్‌ను కూడా కూలుస్తారా?
హుస్సేన్‌సాగర్ తర్వాత నెక్లెస్‌రోడ్, ఆ తర్వాత రైల్వే ట్రాక్ ఉంది. వాటిని కూల్చివేస్తారా? పెద్దల కోసం రోడ్డు నిర్మిస్తున్నారు. మా ఇండ్లు అడ్డువస్తుందని కావాలనే తొలగించాలని చూస్తున్నారు. అందుకే ఎఫ్టీఎల్లో ఉందని అధికారులు మాట్లాడుతున్నారు. మా బంధువులు మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఇండ్లు కూల్చివేయడంతో కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఇప్పుడు మా వంతు వచ్చినట్లు కనిపిస్తున్నది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని చెబుతున్న మాటల్లో అర్థం లేదు.
– అహ్మద్, బీఎస్ మక్తా
ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయం
50 ఏండ్లుగా మా తాత ముత్తాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మాకు ఉన్న ఆధారం ఈ ఇల్లు ఒక్కటే. అలాంటి ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా చేయాలి..ఎక్కడికి పోవాలి. బుల్డోజర్లు తీసుకువచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయం. పేదల ఇండ్లను కూల్చి వారిని రోడ్డున పడేయడమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన సాగుతున్నది. బస్తీల జోలికి రాబోమని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చి మా ఇండ్ల మీదకు వస్తున్నాడు.
– పాషా, ఎంఎస్ మక్తా