మేడే రోజు పారిశుధ్య కార్మికులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల జీతాన్ని రూ. 1000 పెంచుతూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీలో 25, 613, జలమండలిలో 4వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరనున్నది. ఈ సందర్భంగా కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.
సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు వారి ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి వారికి న్యాయపరమైన హక్కులను కల్పిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి నోటరీ స్థలాలను జీవో 58, 59 ప్రకారం క్రమబద్ధీకరించుకోవడానికి మరో నెల రోజుల పాటు గడువు పొడిగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. తక్షణమే తమ తమ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలను కలిసి తమకున్న నోటరీ తదితర ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్ సమస్యలను తెలుపుకోవాలన్నారు. అన్ని సమస్యలను క్రోఢీకరించి, పరిష్కరించి, వారికి న్యాయపరమైన హక్కులతో కూడిన పట్టాలను ప్రభుత్వం అందజేస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఏకకాలంలో పేదల ఇండ్ల సమస్యలు పరిష్కారం కావాలనేది ప్రభుత్వ ఉద్దేశమని, ఇందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఇదే సందర్భంలో వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. త్వరలోనే ఇందుకు సంబంధించి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నామని తెలిపారు.
సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయగా.. నోటరీ, 58, 59 జీవోలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మరో నెల రోజుల పాటు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అవకాశాన్ని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, కుర్మయ్యగారి నవీన్‌కుమార్, ఎమ్మెల్యేలు అరెకెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, మాధవరం కృష్ణారావు, జాజుల నరేందర్, అత్రం సక్కు, అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్, మే1(నమస్తే తెలంగాణ): జీవో 58, 59 దరఖాస్తుల గడువును ముఖ్యమంత్రి కేసీఆర్ పొడిగించినట్లు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. జంట నగరాల మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి పట్టాలను ప్రభుత్వం అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని మేడ్చల్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి మొత్తం 79,300 మంది దరఖాస్తులు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో 58, 59 జీవోకు గతంలో 12 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో 11 వేల వరకు దరఖాస్తులు స్వీకరించగా.. గత నెలలో మరో వెయ్యి వరకు ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లాలో 58 జీవో కింద గతంలో 13 వేల మంది దరఖాస్తు చేసుకోగా గత నెలలో 7600 మంది దరఖాస్తులు కలిపి 20,600 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 59 జీవో కింద గతంలో 19,000 మంది దరఖాస్తు చేసుకోగా గత నెలలో 6,300 మంది దరఖాస్తులతో కలిపి 25,300 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం కలిపి రంగారెడ్డిలో 45,900 మంది దరఖాస్తు చేసుకున్నారు.
మేడ్చల్ జిల్లాలో గతంలో 58 జీవో కింద 9,200 మంది దరఖాస్తు చేసుకోగా… 59 జీవో కింద 12,200 మంది కలిపి మొత్తం 21,400 మంది దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 79,300 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు.