సిటీబ్యూరో: శివారులోని మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం గందరగోళంగా జరిగిందనే అంశం మరోసారి తేటతెల్లమైంది. నగరవాసులతోపాటుగా, కార్పొరేటర్లలను కూడా అయోమయానికి గురిచేస్తోంది. హడావుడిగా విలీన ప్రక్రియ చేపట్టడమే కాకుండా అమలు చేసిన విధానాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేటర్లు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం జరిగిన బల్దియా బడ్జెట్-2026 సమావేశాల్లో కార్పొరేటర్లు వ్యక్తం చేసిన సందేహాలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
కౌన్సిల్ వేదికగా కార్పొరేటర్లు లేవనెత్తిన అంశాలు, సర్కారు విధానాలను సూటిగా ప్రశ్నించినట్లుగా ఉన్నాయి. శనివారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన చివరి జనరల్ బాడీ కౌన్సిల్ సమావేశాల్లో కార్పొరేటర్లు లేవనెత్తిన సందేహాలతో… కాంగ్రెస్ సర్కారు విలీన ప్రక్రియ తొందరపాటు చర్యగా స్పష్టం అవుతున్నది. బల్దియా కమిషనర్లు బడ్జెట్ ప్రతిపాదనలు కౌన్సిల్ సమావేశం ముందు ప్రవేశపెట్టిన వెంటనే పలు అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఆదాయ వనరులు, పన్నుల విషయంతో సభ్యులకు ఇప్పటికీ అనుమానంగా ఉన్నారు. ఇక విలీన ప్రాంతాలను కలుపుకొని రూపొందించిన బడ్జెట్లోనూ లోపాలు ఉన్నాయనే విషయం తేలింది.
ఖర్చు ఎక్కువ… ఆదాయం తక్కువ
గ్రేటర్లో మున్సిపాలిటీలను విలీనం చేసిన తర్వాత బల్దియా ఆదాయం పెరుగుతుందని అంచనా ఉంది. ఎందుకంటే జీహెచ్ఎంసీ పన్ను శాతం ఎక్కువ ఉండటమే దీనికి కారణం. కానీ తాజా బడ్జెట్లో యూఎల్బీల ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం ఎందుకు ఉందని ఓ కార్పొరేటర్ ప్రశ్నించారు. ఒకసారి గ్రేటర్లో విలీనం తర్వాత బల్దియాకు వచ్చే ఆదాయం ఎందుకు పెరగలేదన్నారు. జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం ఆస్తి పన్ను పెరుగుతుంది. దీంతో ఆదాయం వస్తోంది. కానీ తాజా బడ్జెట్లో గతంలో ఆయా మున్సిపాలిటీలు చేసిన ఖర్చుల కంటే ఎక్కువగా తాజా బడ్జెట్లో ఉన్నాయన్నారు. అదేవిధంగా వచ్చే ఆదాయం కూడా దాదాపు రూ. 400 కోట్లు తగ్గిందని నిలదీశారు. యూఎల్బీ హెడ్ ఆఫ్ అకౌంట్స్‌లోని వివరాలు, బల్దియా బడ్జెట్లో ఎందుకు వ్యత్యాసం ఉందన్నారు.
ఇక విలీనం చేసిన తర్వాత కూడా ఆయా సంస్థలు తీసుకున్న రుణాల విషయాన్ని బడ్జెట్లో ఎందుకు స్పష్టంగా లేదని పేర్కొన్నారు. ఆ రుణాలపై వడ్డీ, ఇక ఉద్యోగుల విషయంలోనూ అనుమానాలు వ్యక్తం చేశారు. విలీనమైన ఉద్యోగులు, కొత్తగా భర్తీ చేసే ఉద్యోగులతోపాటు, బల్దియా ఉద్యోగులకు కూడా సీనియార్టీ ప్రకారంగా జీతభత్యాల చెల్లింపు ఎక్కడి నుంచి జరుగుతాయన్నారు. ఇక జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ప్రాపర్టీ ట్యాక్సులు, భవన నిర్మాణ అనుమతుల విషయంపైనే కూడా సందేహం వ్యక్తం చేశారు. బల్దియా పరిధిలో ఉన్న భవనాలకు అనుమతుల బాధ్యతను హెచ్ఎండీఏకు ఎందుకనీ ప్రశ్నించారు.
10 అంతస్తులే కాదు, 100 అంతస్తుల భవనాలకు అనుమతులు కావాలన్నా.. చార్జీలను బల్దియా ఖాతాలోకి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. దీంతో ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందనీ, అదే గనుక జరిగితే నగర వాసులకు మౌలిక వసతులు అందించేందుకు నిధుల కొరత ఏర్పడుతుందన్నారు. కొత్తగా విలీనమైన సంస్థల నుంచి రావాల్సిన ఆదాయం కూడా రూ. 200-400 కోట్లు ఎందుకు తగ్గిందనే విషయాన్ని ప్రస్తావించారు. 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2వేల చదరపు కిలోమీటర్లకు పైగా బల్దియా పరిధి పెరిగినా… పెరిగిన విస్తీర్ణానికి అనుగుణంగా నిర్వహణ వ్యయాలపై అంచనాలు లేకపోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న జీహెచ్ఎంసీలో చెత్త సేకరణ రూ. 6 కోట్లు రావడం ఏంటని ప్రశ్నించారు. బల్దియా పరిధి పెరిగిందని అట్టహాసంగా చెబుతోంది.
కానీ ఇప్పటికీ కొన్ని శాఖల మధ్య సమన్వయ లోపంతోపాటు, బాధ్యతల అప్పగింతలు అస్తవ్యస్తంగా ఉందన్నారు. ముఖ్యంగా మౌలిక వసతులు కల్పన, భవన నిర్మాణ అనుమతులు, తాగునీటి వసతుల విషయంలోనే ఈ అభ్యంతరాలు ఉన్నాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో హెచ్ఎండీఏ నిబంధనలు, అదేవిధంగా వాటర్ వర్క్స్‌తో తెగదెంపులతోపాటు, ఇప్పటికీ ప్రభుత్వ ఆస్తుల విషయం కొలిక్కి రాలేదని పలువురు సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. మొత్తంగా సర్కారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అధికారులు వ్యవహారించారే తప్పా… దీనిపై ఎలాంటి కసరత్తు జరగలేదనీ స్పష్టం చేశారు.