777 రూల్.. ప్రస్తుత డేటింగ్ ప్రపంచంలో తెగ పాపులర్ అవుతున్నది. భాగస్వాముల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి సాయపడుతున్నది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండే జంటల్లో ఆత్మీయత తగ్గకుండా చూస్తున్నది. ఒకరికొకరు తగినంత సమయాన్ని కేటాయించుకోవడానికీ అక్కరకొస్తున్నది. సమయాన్ని మూడు భాగాలుగా విభజించడమే 777 రూల్! అందుకు తగ్గట్టుగా భాగస్వాములు తమ సమయాన్ని కేటాయించడం.
7 రోజులకు ఒకసారి: కనీసం వారానికి ఒకసారైనా ఇద్దరూ కలిసి డేట్‌కు వెళ్లాలి. బయట డిన్నర్ కావచ్చు, ఇంట్లోనే ప్రశాంతంగా సినిమా చూడటం కావచ్చు. ఫోన్లు, ఆఫీస్ వర్క్ పక్కన పెట్టేయాలి. దీంతో ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది.
7 వారాలకు ఒకసారి: కనీసం ఏడు వారాలకు ఒకసారి.. ఇద్దరూ కలిసి ఓ చిన్న ట్రిప్ ప్లాన్ చేయాలి. రోజువారీ యాంత్రిక జీవితం నుంచి బయటపడి.. కొత్త ప్రదేశంలో కలిసి గడపాలి. దీనివల్ల మనసు రిఫ్రెష్ అవుతుంది.
7 నెలలకు ఒకసారి: కనీసం ఏడు నెలలకు ఒకసారి.. ఒక పెద్ద వెకేషన్‌కు వెళ్లాలి. ఒక వారంపాటు నచ్చిన ప్రదేశాన్ని చుట్టిరావాలి. ఇలాంటి విహారయాత్రల వల్ల.. ఇద్దరి మధ్య బంధం మరింత దృఢంగా మారుతుంది.
ఎందుకింత ట్రెండ్ : 777 రూల్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నది. ఇందుకు కారణం.. బిజీ జీవితమే! నేటికాలంలో పని ఒత్తిడి వల్ల చాలామంది భాగస్వాములకు కనీసం మాట్లాడుకునే సమయం కూడా ఉండటం లేదు. ఇలాంటి వారంతా ‘777 రూల్’ను పాటిస్తున్నారు. ఒక క్రమశిక్షణకు అలవాటు పడుతున్నారు. ఇలా పక్కా ప్లాన్‌తో కలవడం వల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఇక ఎప్పుడూ ఒకేలా కాకుండా.. రాబోయే ట్రిప్స్ గురించి ప్లాన్ చేసుకోవడం వల్ల రిలేషన్షిప్ మరింత బలోపేతం అవుతుంది.