– శుభకార్యాల నిర్వహణలో తప్పని ఇబ్బందులు
– సింగరేణి అధికారుల నిర్లక్ష్యంపై కార్మికుల ఆగ్రహం
రుద్రంపూర్, సెప్టెంబర్ 01 : కార్మిక కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు ఆనందాల వేదికగా ఉండాల్సిన కమ్యూనిటీ హాల్ ప్రస్తుతం నత్తల సమస్యతో నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. శుభకార్యానికి వచ్చే అతిథుల కంటే కమ్యూనిటీ హాల్లో కనిపించే నత్తల సంఖ్యే ఎక్కువగా ఉంటోందంటూ శుభకార్యం నిర్వహించుకునే నిర్వాహకులు, కార్మిక కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని గౌతంపూర్ ప్రాంతంలో కార్మికుల ఇళ్లలో జరిగే వివాహాలు, నిశ్చితార్థాలు, ఇతర కుటుంబ శుభకార్యాల నిర్వహణ కోసం సింగరేణి యాజమాన్యం కమ్యూనిటీ హాల్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ప్రస్తుతం ఈ కమ్యూనిటీ హాల్లో నెలకొన్న పరిస్థితులు శుభకార్యాల నిర్వాహకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కమ్యూనిటీ హాల్ పరిసర ప్రాంతంలో అధికంగా చెమ్మ ఉండటమే నత్తలు పెరగడానికి ప్రధాన కారణమని స్థానికులు, నిర్వాహకులు చెబుతున్నారు. హాల్ చుట్టుపక్కల ప్రాంతంలో నీరు నిల్వ ఉండటం, తేమ ఎక్కువగా ఉండటం వల్ల నత్తలు విపరీతంగా పెరిగి హాల్లోకి చేరుతున్నాయని అంటున్నారు.
ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోడలు, నేల, మూలలు, డ్రైనేజీ ప్రాంతాలు ఇలా ఎక్కడ చూసినా నత్తలు కనిపిస్తుండటంతో కమ్యూనిటీ హాల్‌కు వచ్చే వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే కమ్యూనిటీ హాల్ పరిసర ప్రాంతంలో పేరుకుపోతున్న చెమ్మను తొలగించి, నీరు నిల్వ ఉండకుండా తగిన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే నత్తల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. హాల్ చుట్టుపక్కల ఉన్న తేమను తగ్గించి, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా నత్తల పెరుగుదలను అరికట్టవచ్చని అంటున్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.