కరోనా తర్వాత సామాజిక జీవితంలో కొత్త ధోరణులు చాలానే వచ్చాయి. వాటిల్లో ఒకటైన ‘లేజీ గాల్ జాబ్’ ఇప్పుడు ట్రెండింగ్ అని సైకాలజిస్టులు అంటున్నారు. ‘పని కోసం ఆసక్తి చూపకపోవడం వల్ల వచ్చిన సమస్య’ అనుకునేరు. అది కాదట పని తమ జీవితాలకు అనుకూలంగా ఎలా ఉండాలో భావించే కొత్త తరం సంప్రదాయ ఉద్యోగ ధోరణుల్ని తిరస్కరిస్తున్నారు. అంతేకానీ, పనిని ప్రేమించట్లేదని కాదు. ఎక్కువ సమయం డెస్కుకి పరిమితమైపోయి ఉండే ఉద్యోగాలు కంఫర్ట్ కాదని భావిస్తున్నారట. ‘ప్రొడక్టివ్ జాబ్ ఓకే. కానీ, రోజంతా పనికి అందుబాటులో ఉండాలి.
ఎక్కువ గంటలు పని చేయాలి’ అంటే ఆ ఉద్యోగాలు వద్దనుకుంటున్నారట. ఆడపిల్లలు ఉద్యోగాలు చేసినా, తమకు కావాల్సినంత సమయం, వ్యక్తిగత జీవితం ఉండాలని కోరుకుంటున్నారు. సమయాన్ని అర్థవంతంగా గడపడానికి ఉద్యోగం ఆటంకం కాకూడదని చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత జీవితాలకు ప్రాధాన్యం లేకుండా చేసే ఉద్యోగాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అందుకే వివాహం, పిల్లలు పుట్టిన తర్వాత చాలామంది ఉద్యోగాలు శాశ్వతంగానో, తాత్కాలికంగానో మానేస్తున్నారు.
ఇది ఉద్యోగం అవసరం లేదని, దానిపట్ల విరక్తి, వ్యతిరేకతగానో చూడొద్దని సైకాలజిస్టులు అంటున్నారు. జీవితం అర్థవంతంగా గడపాలనే నిర్ణయానికి ఏదీ ఆటంకం కాకూడదనే ఈ కాలం ఆడపిల్లలకు (లేజీ గాల్స్)కు అనుకూలంగా కంపెనీలూ మారుతున్నాయి. డాటా ఎంట్రీ, హెచ్ఆర్, కన్సల్టెన్సీ ఉద్యోగాలే కాకుండా చాలా ఉద్యోగాలు రిమోట్, హైబ్రిడ్ మోడ్లో అమ్మాయిల మనస్తత్వానికి అనుకూలంగా మార్చుకున్నాయి. కానీ, ఇంకా మార్పు రావాలని సోషల్ మీడియాలో గళం విప్పుతున్నారు కొందరు లేజీ గాల్స్.