Double Bedroom Homes | పేదలకు అందని డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకే..!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అనర్హులకు, స్థానికేతరులకు, ఎమ్మెల్యేల అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెడుతున్నారు. దీంతో నిజమైన అర్హుల సొంతింటి కల.. కలగానే మిగిలిపోతున్నది.
Double Bedroom Homes | హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 30: పేదల సొంతింట కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులు, వ్యవహారాలపై పలు విమర్శలు, అక్రమాల ఆరోపణలు వస్తున్నాయి. ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని, ఇళ్ల దందాపై నేతల మధ్య విమర్శలు చెలరేగుతున్నాయని ఆరోపణలు లేకపోలేదు. అనర్హులకు డబుల్బెడ్రూంలు కేటాయించి అర్హులకు మొండి‘చేయ్’ ఇచ్చారని పేదలు మండిపడుతున్నారు. కూలిపని చేసుకునే వారిని విస్మరించి ఆర్థికంగా ఉన్నవారికే ఇండ్లు కట్టబెట్టారని వాపోతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా రంగులు వేసి పంపిణీ చేసింది. గత బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం పూర్తయిన ఇండ్లను నిజమైన అర్హులకు పంపిణీ చేయకుండా ఇష్టానుసారంగా ఇచ్చారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అనర్హులకు, స్థానికేతరులకు, ఎమ్మెల్యేల అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెడుతున్నారు. దీంతో నిజమైన అర్హుల సొంతింటి కల.. కలగానే మిగిలిపోతున్నది. హనుమకొండ బస్ స్టేషన్ సమీపంలోని జితేందర్‌నగర్, అంబేద్కర్, న్యూశాయంపేటలో నిర్మించిన సుమారు 1000 డబుల్‌బెడ్ రూంలను పేదలకు పంచకుండా అనర్హులకు డబుల్బెడ్రూంలు పంపిణీ చేశారని ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకు కేటాయింపు..
స్థానిక ఎమ్మెల్యే తన అనుచర గణానికి, ఇంట్లో పనిచేసేవారికి, వారి బంధువులకు, అతనికి ఊడిగం చేసేవారికి, నాయకులకు, కార్యకర్తలకు, కార్పొరేటర్లకు కొన్ని ఇళ్ల లెక్కన పంచుకున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇందులో సుమారు 50 మంది జర్నలిస్టులు కూడా తీసుకున్నట్లు, కొందరు బినామీ పేర్లతో పొందినట్లు సమాచారం. నగరానికి ప్రధాన రహదారిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసింది. అందులో భాగంగానే నగరంలో స్థానిక కాంగ్రెస్ నేతలు, వారికే ఇండ్లను కేటాయిస్తున్నారు. కనీసం వాళ్లిచ్చిన లిస్టులో ఎవరున్నారు..? నిజమైన అర్హులకు లబ్ధి చేకూరుతున్నదా..? అని చూడకుండానే ఎమ్మెల్యే ఇచ్చిన పేర్లు, అతని అనుచరుడు ఎవరికిపడితే వారికి ఇష్టమొచ్చినట్లు పట్టాలు పంపిణీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. పేదోళ్లకు ఇండ్లు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నది. డబుల్ బెడ్రూం ఇండ్లను పేదలకు పంచకుండా కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేస్తూ ఇతరులకు కట్టబెడుతున్నదని మండిపడుతున్నారు.
అర్హులకు తీవ్ర అన్యాయం..
డబుల్‌బెడ్ రూం ఇళ్లలో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందనే ఆరోపణలు లేకపోలేదు. ఏళ్ల తరబడిగా అద్దె ఇంట్లో ఉంటున్న తమను ఆదుకునేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఇండ్లను నిర్మిస్తే ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికేతరులకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు కాకుండా స్థానిక ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు అనుచరులకు కట్టబెట్టారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల వద్దకు వచ్చి పంపిణీ చేస్తే అసలైన అర్హులు అభ్యంతరం వ్యక్తం చేస్తారని.. వేరేచోట వారికి నచ్చినవారికి ఇండ్ల పట్టాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర నాయకులు ఇండ్లు కట్టిన ప్రాంతానికి రాకుండా పకడ్బందీగా హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం పట్టాలు పంపిణీ చేశారని మండిపడుతున్నారు. అసలైన అర్హులు అక్కడికి వచ్చి గొడవ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగానే మౌలిక సదుపాయాలు సరిగా లేక కొందరు, ఆర్థిక, రవాణా సదుపాయాల దృష్ట్యా కేటాయించిన ఇండ్లలోకి వెళ్లలేక కొందరు, పిల్లల చదువుల దృష్ట్యా సిటీలో ఉంటున్నా మరికొందరు కేటాయించిన ఇండ్లలో వెళ్లేందుకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాజెక్టులో ఎన్ని కేటాయింపులు జరిగాయి? వారు అర్హులేనా? అనర్హులు ఉన్నారా? లబ్ధిదారులు ఇతరులకు అమ్ముకున్నారా? కేటాయించిన ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం ప్లాట్లు ఎన్ని ఉన్నాయి? అనే కోణంలో విచారణ జరిపి ఉన్నతాధికారులు నిగ్గుతేల్చాలని అర్హులైన పేదలు డిమాండ్ చేస్తున్నారు.


Read Also :
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Double Bedroom Homes | పేదలకు అందని డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకే..!
Chinese Food | చైనీస్ ఫుడ్ వండేటప్పుడు పాత్రలపై మంటలు వస్తాయి.. ఎందుకని..?
Vatsala Rajagopal | ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ కన్నుమూత!
Kranthi Kiran | కరువు మండలాలుగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలి : మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
‘భట్టి విక్రమార్క రాజీనామా చేయాలి.. సీపీని వెంటనే బదిలీ చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

