ఘట్కేసర్, ఏప్రిల్ 14: ఘట్కేసర్ పట్టణంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు 17 సంవత్సరాల క్రితం ప్రారంభమై నేటికి పూర్తికాకపోవటంతో పట్టణంలో ప్రజాగ్రహం పెల్లుబిక్కుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, స్థానిక ప్రజా ప్రతినిధుల వైఫల్యం వలనే ఈ పరిస్థితి వచ్చిందని సామాజిక కార్యకర్త బచ్చు ప్రమోద్ గుప్తా ఆరోపించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రైల్వే బ్రిడ్జి సాధనకై ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు.
పట్టణ జేఏసీ, యువత, స్థానిక ప్రజలతో కలిసి ఈ దీక్షను చేపడుతున్నట్లు తెలిపారు. దశాబ్దాలుగా రైల్వే క్రాసింగ్ వద్ద ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి ఇబ్బందులు పడుతున్నా అధికారంలో ఉన్నవారు కేవలం హామీలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఇచ్చిన వినతులు, సమావేశాలు, గత నిరసనలు ఏది ఫలితం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దీక్ష సాధారణ నిరసన కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యంపై చివరి పోరాటమని బచ్చు ప్రమోద్ గుప్తా స్పష్టం చేశారు. దీక్ష సమయంలో ఏదైనా అనుకోని పరిణామాలు జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, యువత, బాలాజీనగర్వాసులు భారీగా హాజరై దీక్షకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
మల్లారెడ్డి హామీ.. వాయిదా పడిన దీక్ష
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సొంత నిధులతో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తానని హామీ యిచ్చి కంట్రాక్టర్తో సోమవారం చర్చలు జరిపిన దృష్ట్యా దీక్షను కొద్దిరోజులు వాయిదా వేయాలని స్థానిక నాయకులు ప్రమోద్ గుప్తాను కోరడంతో ఆయన దీక్షను వాయిదా వేశారు. అయితే పనులు వెంటనే ప్రారంభం కాకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధ్దమని ఆయన హెచ్చరించారు.