సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : ఔటర్ రింగు రోడ్డు లోపల 193 గ్రామాలకే కాదు.. ఇక మీదట కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకూ సమృద్ధిగా తాగునీరు అందనున్నది. నగరం నలువైపులా ఆకాశహర్మ్యాలు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ అపార్ట్మెంట్లు, విల్లాలతో మినీ నగరాలు రావడం..ఇక్కడి ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా తాగునీటిని అందించే ఉద్దేశంతో రూ. 1200 కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్-2 పనులను కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, పటాన్చెరువు నియోజకవర్గాల్లో రెండు ప్యాకేజీలుగా విభజించి 73 రిజర్వాయర్ల పనులు చేపట్టగా..ఇప్పటికే 23 రిజర్వాయర్లను కేసీఆర్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చి కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కష్టాలను దూరం చేసింది. వచ్చే వేసవి నాటికల్లా ఈ పథకం పూర్తి ఫలాలు అందుబాటులోకి రానున్నాయి.
ఓఆర్ఆర్-2 ప్రాజెక్టు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, ఈ వేసవి కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఓఆర్ఆర్ ప్రాజెక్టు-2లోని కిస్మత్ఫూర్, మంచిరేవుల, బైరాగిగూడ, గంధం గూడ, బృందావన్ కాలనీ, ఎర్రకుంట అభ్యుదయ నగర్, గండిపేట్లలో నిర్మాణం పూర్తి చేసుకున్న పలు రిజర్వాయర్లను సందర్శించారు. రిజర్వాయర్లలో ఇన్లెట్, అవుట్లెట్లను ఎండీ పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ లైన్లు, కొత్త రిజర్వాయర్ల వల్ల లబ్ధి జరిగే ప్రాంతాల వివరాలను ఆరా తీశారు. పెండింగ్‌లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ లైన్లు, ఇతర పనులను పూర్తి చేసి ఈ వేసవిలో వంద శాతం నీరు సరఫరా అందించేలా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న రిజర్వాయర్లపై వివరాలతో సైన్బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.