సిటీబ్యూరో, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కోకాపేట గత కొంత కాలంగా ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలుస్తున్నది. ఎకరం ధర వంద కోట్లకు పైగా పలకడం నగరంలోనే కాకుండా దేశ రియల్ ఎస్టేట్ రంగంలోనే కోకాపేటకు ప్రత్యేక స్థానం వచ్చింది. దీనికి తోడు ఐటీ కారిడార్‌లో ఎన్నో ప్రాంతాలున్నా ఇప్పుడు కోకాపేట హాట్‌స్పాట్‌గా మారింది. ఇలా ఎంతో ప్రాచుర్యం సొంతం చేసుకున్న కోకాపేటలో సరికొత్తగా మల్టిఫ్లెక్సు నిర్మాణం రానుంది. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ నేతృత్వంలో కోకాపేట – నార్సింగి ప్రాంతంలో భారీ మల్టీఫ్లెక్సుతో పాటు సినిమా స్క్రీన్లు అత్యాధునిక శైలిలో నిర్మాణాలు జరగనున్నాయి. మెహిదీపట్నం నుంచి శంకర్పల్లి వెళ్లే ప్రధాన రహదారిలో కోకాపేట జంక్షన్లో అల్లు స్టూడియోస్ ఆధ్వర్యంలో దీన్ని నిర్మించేందుకు ప్రాథమికంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
త్వరలోనే అనుమతులు వస్తే కోకాపేటలో మల్టీఫ్లెక్సు నిర్మాణం పనులు మొదలు కానున్నాయి. ఇప్పటికే కోకాపేట కేంద్రంగా 59 అంతస్థులతో కూడిన ఆకాశ హర్మ్యాలు పదుల సంఖ్యలో ఈ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నాయి. ఒకవైపు ఐటీ కార్యాలయాలు, నివాస ప్రాంతాలతో కోకాపేట నగర వాసులకు ఫేవరెట్ ప్లేస్‌గా మారింది. హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులతో పాటు విల్లా ప్రాజెక్టులు సైతం కోకాపేట పదుల సంఖ్యలో ఉండటంతో వారికి అవసరమైన సామాజిక అవసరాలపై కల్పనపై రియల్ ఎస్టేట్ సంస్థలు దృష్టి సారించాయి. ఇప్పటి వరకు మల్టీఫ్లెక్సు అంటే మాదాపూర్ ఇనార్బిట్ మాల్, కొండాపూర్‌లోని శరత్ క్యాపిటల్ మాల్‌కు వెళ్లాల్సి వచ్చేది. వాటి తర్వాత నానక్‌రాం గూడ, నార్సింగి, గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ ప్రాంతంలో అలాంటి లేకపోవడంతో కోకాపేట కేంద్రంగా మల్టీఫ్లెక్సు నిర్మాణం మరింత ప్రత్యేకతను సంతరించుకోనుంది. వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌తో పాటు వాక్ టు షాపింగ్, ఎంటర్టైన్మెంట్ అనే నినాదం కోకాపేట, దాని చుట్టు పక్కల ఉన్న ప్రజలకు అందుబాటులోకి రానుంది.