బడంగ్పేట్, నవంబర్ 20 : బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్లో నిర్మాణం చేపడుతున్న అర్బన్ హెల్త్ సెంటర్ వివాదాస్పదంగా మారింది. గురువారం పనులు చేయకుండా ఆక్రమణదారులు అడ్డుకున్నారు. దీంతో అధికారులకు, ఆక్రమణదారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ద్వార అర్బన్ హెల్త్ సెంటర్ను మంజూరు చేయించారు.
రెవెన్యూ అధికారులతో మాట్లాడి అర్బన్ హెల్త్ సెంటర్ (పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)కోసం 450 గజాల స్థలం తీసుకోవడం జరిగింది. రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. రూ.1.43 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేయించా రు. ఎన్నికల కోడ్ రావడంతో అర్బన్ హెల్త్ సెంటర్ పనులు పూర్తి చేయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు 30-11-2024 నాడు అర్బన్ హెల్త్ సెంటర్కు శంకుస్థాపన చేశారు.
మంత్రి శంకుస్థాపన చేసి రెండు సంవత్సరాలు కావస్తున్నా అధికారులు పనులు మొదలు పెట్టలేదు. రెండు సంవత్సరాల తర్వాత మల్లాపూర్లో అర్బన్ హెల్త్ సెంటర్ పనులు మొదలు పెట్టడానికి అధికారులు జేసీబీతో పనులు చేయిస్తుండడం వివాదాస్పదంగా మారింది. సర్వే నంబర్ 44లో ఉన్న భూమి తమదేనని కొంత మంది నకిలీ పత్రాలతో కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి పనులు నిలిపివేయడంతో గొడవమొదలైయింది. దీంతో ఒకరిపై ఒకరు బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. అదే స్థలంలో గతంలో 22-06-2021లో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రూ.21లక్షలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. పబ్లిక్ టాయిలెట్స్ కూడా నిర్మాణం చేశారు. అప్పటి దాక స్థలం ప్రభు త్వ ఆధీనంలో ఉంది.
అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణ పనుల్లో జాప్యం కావడంతో స్థలం మాదేనంటు కొంతమంది అభ్యంతరం తెల్పడంతో వివాదం చోటు చేసుకుంది. మంత్రి శంకుస్థాపనలు చేసినా పనులు అడ్డుకోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఆసుపత్రి నిర్మాణ పనులు అడ్డుకున్న వారిపై మున్సిపల్ అధికారులు బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. స్థలం మాదే అన్న వారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని డీఈ వెంకన్న పేర్కొన్నారు. తమపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారన్నారు. జేసీబీని అడ్డుకున్నారన్నారు. పోలీసులు సహకరించలేదన్నారు.