గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చిరువ్యాపారులపై కాంగ్రెస్ సర్కార్ బుల్డోజర్ తాండవం కొనసాగుతున్నది. చిరు వ్యాపారుల జీవితాలను రోడ్డున పడేస్తున్నది. ఆక్రమణల పేరిట నగర వీధుల్లో అధికారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. పొట్టకూటి కోసం చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ..కుటుంబాలను పోషించుకుంటున్న బడుగు జీవులకు జీవనాధారం లేకుండా చేస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా బుల్డోజర్లతో కూల్చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదో ఒక రూపంలో పేద, మధ్య తరగతి కుటుంబాలను రోడ్డు పాలు చేయడమే లక్ష్యంగా పాలన సాగుతున్నది. శనివారం ఎక్కడికక్కడ పోలీసు పహారా నడుమ జీహెచ్ఎంసీ అధికారుల సమక్షంలో కూల్చివేతల పర్వం కొనసాగింది. తమ ఇండ్లు, హోటళ్లు, చిరు వ్యాపార సముదాయాలను కూల్చొద్దని వేడుకున్నా..ఉపాధి కోల్పోయి కుటుంబాలను పోషించుకోలేని స్థితికి చేరుకుంటున్నామని కన్నీటి పర్యంతమైనా.. కనికరించలేదు. కనీసం తమ సామగ్రిని సర్దుకునేందుకు సమయం ఇవ్వాలని వేడుకున్నా పట్టించుకోకుండా..కూల్చివేతలు చేపట్టారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్టీట్ వెండర్స్‌కు ఉపాధి కల్పించి అక్కున చేర్చుకున్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంధకారంలోకి నెట్టబడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Hyd1
సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తేతెలంగాణ): గ్రేటర్లో అధికారులు చిరు వ్యాపారాలపై బుల్డోజర్లుతో విరచుకుపడ్డారు. అనేక మంది కుటుంబాలను రోడ్డునపడేశారు. కూల్చివేతలు జరిగే ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగాల సిబ్బంది, ట్రాఫిక్, పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. నిత్యం రద్దీగా ఉంటూ లక్షలాది మంది చిరు వ్యాపారులు, దినసరి కూలీలకు ఉపాధి అందించే బేగంబజార్‌లో అధికార యంత్రాంగం భారీగా కూల్చివేతలు చేపట్టింది. బేగం బజారులోని రతన్ టవర్స్, బేగంబజార్, ఫిష్ మార్కెట్, బేగంబజార్ వార్డు కార్యాలయం, ముస్లింజంగ్ వంతెన తదితర ప్రాంతాలకు బృందాలను నియమించి పోలీస్ బలగాల పహారాలో కూల్చివేతలు చేపట్టారు.
అదేవిధంగా సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడ చౌరస్తా నుంచి వారాసిగూడ వరకు రోడ్డుకు ఇరువైపులా అడ్డొచ్చిన ప్రతి నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. తమ సామగ్రిని సర్దుకునేందుకు సమయం ఇవ్వాలని వేడుకున్నా పట్టించుకోకుండా కూల్చేశారు. చిలకలగూడ పాత అమర్ టాకీస్ చౌరస్తా నుంచి వారాసిగూడ చౌరస్తా వరకు బుల్డోజర్ విజృంభించింది. ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్ నుంచి కొత్త పోలీస్‌స్టేషన్ వరకు.. వెంకటేశ్వరస్వామి ఆలయం మీదుగా బీకేగూడ చౌరస్తా వరకు అన్ని దుకాణాలు, తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్లను నేలమట్టం చేశారు. కొంత సమయం ఇస్తే తామే అక్కడి నుంచి తొలగిస్తామని వేడుకున్నా అధికారులు లెక్కచేయలేదు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని టిప్పుఖాన్ బ్రిడ్జ్ నుంచి అవుటర్ వరకు ఉన్న రేడియల్ రహాదారికి ఇరువైపులా కూల్చివేతలు చేపట్టారు.
చిరు వ్యాపారులకు బీఆర్ఎస్ రక్ష
పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో చిరు వ్యాపారులను గౌరవిస్తూ వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి స్ట్రీట్ వెండర్స్ జోన్లు ఏర్పాటు చేసి ఆదుకున్నది. ఎక్కడైనా రోడ్డును, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ఉంటే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించి ప్రత్యామ్నాయ మార్గాలు చూపింది. పదేండ్ల పాలనలో ఎక్కడా చిరు వ్యాపారలు, వీధి వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తనీయలేదు. ఉపాధి అవకాశాలు కల్పించి వారిని ఆర్థికంగా ఎదిగేలా సహకారం అందించింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయం చూపకుండానే జీవితాలను రోడ్డు పాలు చేస్తున్నది. కొద్ది రోజులుగా స్పెషల్ డ్రైవ్ పేరిట వేలాది మంది కుటుంబాలను రోడ్డున పడేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ బతుకులు బుల్డోజర్ల కింద నలిగిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి నిర్మించుకున్న చిన్నచిన్న షెడ్లు, తోపుడు బండ్లను సైతం బుల్డోజర్ల కింద నలిపేస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు.