సిటీబ్యూరో: ‘ప్రజా పాలన’ సాగిస్తున్నామంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో పేదల బతుకులతో చెలగాటమాడుతున్నది. సామాన్యుడిని ఆదుకుంటామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సరార్.. ఇప్పుడు అదే సామాన్యుడి కడుపుకొడుతున్నది. నగరంలో దశాబ్దాల కాలంగా ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదలపై శనివారం బుల్డోజర్లు విరుచుకుపడ్డాయి.
కనీసం సమాచారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా జేసీబీలతో దుకాణాలను కూల్చివేసి 798 కుటుంబాలను రోడ్డున పడేసి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. బుల్డోజర్లు మిగిల్చిన విషాదం నుంచి ఆదివారం బాధితులు తేరుకోలేదు. నిరంకుశంగా జరిపిన కూల్చివేతలపై బాధిత వ్యాపారులు కన్నీరుమున్నీరవుతున్న పరిస్థితి. అప్పు తెచ్చి ఏర్పాటు చేసుకున్న డబ్బాలను అడ్డంగా కూల్చేశారని, ‘మా ప్రాణాలు పోయినా బాగుండేది’ అంటూ ఒక బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, కేసీఆర్ పాలనలో చిరు వ్యాపారులకు రక్షణ ఉండేదని బాధితులు గుర్తు చేసుకున్నారు.
చాయ్ దుకాణమే జీవనం
దాదాపు పదేండ్లుగా టీ షాపుతోనే మా జీవనం సాగుతున్నది. శనివారం ఉదయం ఒక్కసారిగా వచ్చి మా షాపు తొలగించడంతో మా జీవనం దెబ్డతిన్నది. టీ డబ్బా తొలగించడంతో షాపు నిర్వహణ బంద్ చేశాం.
– చరణ్, టీషాపు నిర్వాహకుడు
గిరాకీ దెబ్బతిన్నది..
జీహెచ్ఎంసీ అధికారులు యంత్రాల సాయంతో దుకాణాల ముందు ఉన్న మెట్లు కూల్చివేశారు. దీంతో కొనుగోలుదారులు షాపునకు రావడానికి దారిలేక గిరాకీ దెబ్బతిన్నది. ఇలా ఒక్కసారిగా కూల్చివేయడంతో భయందోళనకు గురయ్యాం.
– పవన్‌గౌడ్, మెడికల్‌షాపు నిర్వాహకుడు