పేదల పక్షపాతి అనే చెప్పుకొనే రేవంత్ ప్రభుత్వం.. అదే పేదోడిపై మళ్లీ బుల్డోజర్లతో గర్జించింది. ప్రత్యామ్నాయం చూపకుండా.. నోటీసులు ఇవ్వకుండా..చిరు వ్యాపారం చేసుకొనే బడుగు జీవులపై విరుచుకుపడింది. మొన్న జీహెచ్ఎంసీ పరిధిలో 798 కుటుంబాలను రోడ్డు పడేసిన సర్కార్..తాజాగా మల్కాజిగిరిలోనూ వందలాది పేదల పొట్టకొట్టింది. మల్కాజిగిరి చౌరస్తా నుంచి ఆనంద్‌బాగ్ వరకు బుధవారం భారీగా పోలీసుల బందోబస్తు మధ్య ఎంఎంసీ అధికారులు తమ ధ్వంస రచన చేపట్టారు.
‘సారు ఈ వ్యాపారమే మాకు ఆధారం.. మా పిల్లల చదువుల సంగతేంటి?..’ అని వేడుకున్నా.. మనసు కరగలేదు. అలాగే బొల్లారం పారిశ్రామికవాడలోనూ రోడ్లకు ఇరువైపులా వీధి వ్యాపారుల దుకాణాలను నేలమట్టం చేశారు. అయితే పెద్ద పెద్ద షోరూంల ఎదుట ఆక్రమణలు కనిపించడం లేదా? కేవలం పూల బుట్టలు, తోపుడు బండ్లు కనిపిస్తున్నాయా? అని బాధితులు అధికారులను నిలదీసినా.. కన్నీరు పెట్టినా వారు దయ చూపకపోవడం.. ప్రజా పాలనలో ‘కాంగ్రెస్ మార్క్’ దమనకాండకు నిదర్శనంగా నిలుస్తున్నది.
సిటీబ్యూరో/మల్కాజ్గిరి, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ ): పేదల పక్షపాతి అని చెప్పుకునే రేవంత్ ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోంది. మాల్కాజిగిరి గడ్డపై పేదవారిపై బుధవారం బుల్డోజర్లు గర్జించాయి. ఏళ్ల తరబడి రోడ్డు పక్కన పూలు, పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న చిరువ్యాపారుల ఆవలను అధికారులు అమాంతం కూల్చేశారు. ప్రత్యామ్నాయం చూపకుండా, కనీస నోటీసులు ఇవ్వకుండానే జేసీబీలతో విరుచుకుపడిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలో 798 కుటుంబాలను రోడ్డున పడేసిన అధికారులు..తాజాగా మల్కాజిగిరి చౌరస్తాలో వందలాది పేద కుటుంబాల పొట్టకొట్టారు. ప్రధాన రహదారులపై భారీ భవనాలు కట్టిన బడా వ్యాపారులు ఫుట్‌పాత్‌లను తమ పార్కింగ్ స్థలాలుగా మార్చుకున్నా పట్టించుకోని యంత్రాంగం కేవలం చిరు వ్యాపారులనే లక్ష్యంగా చేసుకోవడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. పెద్ద పెద్ద షోరూంల ముందు ఆక్రమణలు కనిపించడం లేదా? కేవలం పూల బుట్టలు, తోపుడు బండ్లు కనిపిస్తున్నాయా? అని బాధితులు అధికారులను నిలదీసినా…కన్నీరు పెట్టినా.. అధికారులు కరగకపోవడం శోచనీయం.
మల్కాజిగిరిలో అంతా పేదలే…
మల్కాజ్గిరి చౌరస్తా నుంచి ఆనంద్‌బాగ్ వరకు బుధవారం ఉదయం ఉద్రికత్త వాతావరణం నెలకొంది. భారీగా పోలీసుల బందోబస్తు మధ్య ఎంఎంసీ అధికారులు తమ ‘మార్క్’ ధ్వంస రచన ప్రారంభించారు. అయ్యా ఈ వ్యాపారమే మాకు ఆధారం, మా పిల్లల చదువుల సంగతేంటి? అని వేడుకున్నా అధికారులు కనికరించలేదు. పుట్‌పాత్‌లు, రోడ్డు ఆక్రమణల తొలగింపు పేరుతో చిరువ్యాపారుల సముదాయాలను జేసీబీల సహాయంతో అధికారులు తొలగించారు. దశాబ్ధాలుగా ఇదే ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటున్న వందలాది కుటుంబాలు ఒక్కసారిగా కూల్చివేతలతో దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. వ్యాపారాన్నే నమ్ముకొని జీవనం సాగించే మాకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండానే మా షెడ్డులను తొలగించడం ఏంటని వారు కన్నీటిపర్యంతమయ్యారు.
ప్రత్యామ్నాయం చూపించాలి
అధికారులు.. ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తున్న బడాబాబుల జోలికి వెళ్లకుండా.. చిరువ్యాపారుల డబ్బాలు, షెడ్డులను కూల్చివేయడం ఎంతవరకు న్యాయం? పూలు, కూరగాయాలు, మిర్చిబండి, పంక్చర్ షాపు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నారు. కూలీ దొరకక చిరువ్యాపారం చేసుకునే వారికి ఉపాధి లేకుండా చేయడం దుర్మార్గం. టౌన్‌ప్లానింగ్ అధికారి శ్రీనివాస్‌రావు చర్యలను ఖండిస్తున్నాం. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వడంలేదు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలి. అలాగే మల్కాజిగిరిలోని సీపీఎం కార్యాలయాన్ని కూల్చడం దుర్మార్గం.
– కోమటి రవి,సీపీఎం జిల్లా నాయకుడు
బొల్లారంలో దుకాణాల కూల్చివేత
బొల్లారం : సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామికవాడలో రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన వీధి వ్యాపారుల దుకాణాలను బుధవారం టౌన్ ప్లానింగ్, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేశారు. రోడ్డు పకన పాన్ డబ్బాలు, కూరగాయలు, చిరు వ్యాపార సముదాయాలను ఏసీపీ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ పవన్, సీఐ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది జేసీబీ సహాయంతో తొలగించారు. ఫ్లెక్సీలు, హోర్డింగులు,రోడ్డుపైకి వాలి అడ్డంగా మారిన వ్యాపార షెడ్ల రేకులను తొలిగించారు. రోడ్డు విస్తరణ, ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్ఐ కృష్ణారెడ్డి, టౌన్ ప్లానింగ్ సిబ్బంది వినయ్, యాదగిరి పాల్గొన్నారు.