మల్లాపూర్: మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్లాపూర్ డివిజన్లో బీఆర్ఎస్ నేత హమలి సీనన్న ఆధ్వర్యంలో 500 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అంతకుముందు ఓల్డ్ మల్లాపూర్ లోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్సీ కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 14 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు విసుగు చెందారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు డాక్టర్ చంద్రావతి, బీఆర్ఎస్ నేతలు తండా వాసు గౌడ్, మహిళా అధ్యక్షురాలు కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
శాంతిభద్రతలు అదుపుతప్పాయి..
మెహిదీపట్నం: హైదరాబాద్ సిటీ స్మార్ట్ సిటీ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం నగరంలోని నియోజకవర్గాల ఇన్‌చార్జీలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని, శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత నగరంలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట నేరాలు జరుగుతూనే ఉన్నాయని, శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పారు. ఈ సమావేశంలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జీ శ్రీకాంత్, నియోజకవర్గాల ఇన్చార్జీలు ఆజం అలీ, సామ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.