సిటీబ్యూరో, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ): ఎలివేటెడ్ కారిడార్ విషయంలో భూములు కోల్పోతున్న వందలాది మంది భూ నిర్వాసితులతో కాంగ్రెస్ సర్కారు ఆటలాడుతున్నది. భూపరిహారం తేల్చకుండా, టెండర్లో పేర్కొన్నట్లుగా ప్రాజెక్టు వెడల్పును తగ్గించకుండా భూసేకరణ చేయాలని చేస్తున్న చర్యపలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమందితో ప్రాజెక్టు పరిహారం చర్చించి, మెజార్టీ జనాలను విస్మరించిన రెండుగా విభజించి..భూసేకరణ ప్రక్రియను గట్టెక్కించాలని ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నది.
ఈ క్రమంలో హైదరాబాద్ జిల్లా యంత్రాంగం నిర్వహించిన సమావేశానికి తక్కువ మందిని ఆహ్వానించి, మిగిలిన వారికి ఎలాంటి సమాచారం లేకుండానే భూసేకరణ ప్రక్రియ అంశంపై చర్చించినట్లు భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఆ కార్యక్రమానికి తక్కువ మందే హాజరయ్యారు. కానీ మెజార్టీ జనాల అభిప్రాయాలను సేకరించినట్లు నివేదికను సర్కారుకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడుతున్నారు. దీంతో తక్కువ మంది అభిప్రాయానికి ప్రాధాన్యత ఉంటుందని, సర్కారు ఇచ్చే పరిహారంతోనే తీరని నష్టం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజీవ్ రహదారి జేఏసీ నాయకులు ఆరోపించారు.
అశాస్త్రీయ విధానాలు..
ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన జాబితా 1500కుపైగా ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కానీ ఇటీవల కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన భూసేకరణ అభిప్రాయ సమావేశానికి పదుల సంఖ్యలో బాధితులను పిలిచి నివేదిక రూపొందించారనే ఆరోపణలున్నాయి. ఇక్కడే అధికారులు బాధితులతో డబుల్ గేమ్ ఆడుతున్నారని జేఏసీ నాయకులు అంటున్నారు. ప్రాజెక్టు వెడల్పును 200 ఫీట్ల నుంచి 120 ఫీట్లకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సర్కారు మాత్రం అవేం పట్టించుకోకుండానే భూసేకరణ చేసే క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులను తప్పించుకొనేందుకు బాధితులను బలి చేస్తున్నది.
స్పష్టత లేకుండా..
జేబీఎస్ నుంచి శామీర్పేట మార్గంలో హెచ్ఎండీఏ నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల రెవెన్యూ యంత్రాంగం భూసేకరణ చేస్తున్నది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూముల జాబితాను ఇరు జిల్లాలకు అధికారులు గుర్తించి, భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ సర్కారు మాత్రం ఎలాంటి స్పష్టత లేకుండా భూములు లాక్కోవాలని చూస్తున్నదంటూ.. బాధితులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి హెచ్ఎండీఏ టెండర్ల ప్రకారం 100ఫీట్ల వెడల్పుతోనే ప్రాజెక్టు ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఇరువైపులా కలిపి రెండు వందల ఫీట్ల వెడల్పుతో రోడ్డును నిర్మించేందుకు భూములు సేకరిస్తున్నారు.