సిటీబ్యూరో, మార్చి 25(నమస్తే తెలంగాణ): తమను పోలీసుల రూపంలో వచ్చి మోసం చేసి రూ.ఐదు లక్షల నగదును ఎత్తుకెళ్లారంటూ అరుణ్‌కుమార్ బెహరా అనే వ్యక్తి చేసిన తప్పుడు ఫిర్యాదును బోయిన్పల్లి పోలీసులు ఛేదించారు. బోయినపల్లి పోలీస్ స్టేషన్లో బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, సీఐ లక్ష్మీనారాయణరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఈనెల 22వ తేదీన రాత్రి గాంధీయన్ ఐడియాలజీసెంటర్లో తన బ్రాంచ్ మేనేజర్ సూచనల మేరకు తన అసిస్టెంట్ మేనేజర్‌కు క్యాష్ బ్యాగ్‌ను ఇవ్వడానికి వెళ్తుండగా..పోలీసుల వేషంలో వచ్చిన వారు తనను ఆపి వాహనం ఆర్సీ కాగితాలు చెక్ చేసి డబ్బు ఉన్న బ్యాగు ఎత్తుకెళ్లారంటూ అరుణ్‌కుమార్ బెహరా (32)బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫిర్యాదుదారుడి వాంగ్మూలం నమోదు చేసే క్రమంలో అతడు చెప్పే సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి.
దీంతో అనుమానం వచ్చి తమదైన పద్ధతిలో విచారణ చేయగా.. తన సహోద్యోగి సురేంద్రదాస్(41)తో కలిసి డబ్బు దొంగిలించడానికి ఈ పన్నాగం పన్నినట్లు ఒప్పుకున్నారని అరుణ్‌కుమార్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తప్పుడు ఫిర్యాదు ఇచ్చి మోసం చేయాలని చూసిన అరుణ్‌కుమార్ బెహరా, సురేంద్రదాస్లను అరెస్ట్ చేసి రూ.ఐదు లక్షలను రికవరీ చేశామని పోలీసులు పేర్కొన్నారు.ఈ సమావేశంలో డీఐ సర్దార్ నాయక్, సిబ్బంది మురళి, రాజేశ్ మనోహర్ శ్రీనివాస్, తులసి దాసు పాల్గొన్నారు.