సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): దశాబ్దకాలం పాటు ప్రశాంతంగా ఉన్న నగర వాతావరణం.. పాలకుల అసమర్ధత, పోలీసుశాఖ నిఘాలోపంతో ఉద్రిక్తంగా మారుతోంది. ఆయా ప్రాంతాల్లో నెలకొంటున్న అలజడులతో శాంతిభద్రతల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇందుకు ఆదివారం రాత్రి హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో జరిగిన సంఘటనలే నిదర్శనం. వివర్లాలోకి వెళ్తే.. ఆదివారం రాత్రి నగరంలోని ముషీరాబాద్, అత్తాపూర్, మైలార్‌దేవ్‌పల్లిలోని వాంబే కాలనీలో అలజడులు ఏర్పడటంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. గతంలో సికింద్రాబాద్, బేగంపేటలో జరిగిన ఘటనతో కూడా దాదాపు వారం రోజుల పాటు స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
తక్షణమే స్పందిచకపోవడం..
గతంలో ఏక్కడైనా ఏదైన సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివాదాన్ని ఆదిలోనే అడ్డుకునేవారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి మైలార్‌దేవ్‌పల్లి ఘటనలో ఇరువర్గాలు గుమిగూడటం, రెండు డీసీఎంలకు నిప్పు పెట్టేంత వరకు పరిస్థితులు వెళ్లాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక అత్తాపూర్ ఘటనలో సైతం ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడటంతో పాటు రాళ్లు రువ్వుకోవడం, పోలీసులూ గాయపడటం వరకు వెళ్లిందంటే నగరంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం అవుతోంది. ఇక ముషీరాబాద్ ఘటనలో సైతం రెండు వర్గాల వారు పరస్పరం దాడులకు పాల్పడటం, రాళ్లు రువ్వుకోవడం వంటి పరిస్థితి ఏర్పడటానికి పోలీసు శాఖ వైఫల్యం కొట్టొచ్చినట్లుకనిపిస్తోందని విమర్శలున్నాయి.
అత్తాపూర్‌లో ఉద్రిక్తత..
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లయ్య టవర్స్ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చిన్నపాటి విషయమై తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో ఇరువర్గాల వారు ఆగ్రహావేశాలకు గురై పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పోలీసు సిబ్బంది మధుకర్, శివకుమార్ గాయపడగా, పోలీస్ వాహనం కూడా ధ్వంసం అయినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన సిబ్బందిని అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
మైలార్‌దేవ్‌పల్లిలో…
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రెండు డీసీఎం వాహనాలకు నిప్పంటించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చిన్నపాటి విషయమై జల్పల్లి నుంచి వస్తున్న డీసీఎం డ్రైవర్లతో గుర్తుతెలియని యువకులు వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో డ్రైవర్లు, యువకుల మధ్య తలెత్తిన వివాదం పెద్దదిగా మారడంతో కోపోద్రిక్తులైన గుర్తుతెలియని వ్యక్తులు డీసీఎం వాహనాలకు నిప్పు పెట్టారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నించగా కొందరు దుండగులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు.
దీంతో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఘటనా స్థలికి చేరుకుని స్థానికంగా గుమిగూడిన యువకులను చెదరగొట్టి, భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇదిలా ఉండగా వాహనాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ కొంతమంది మైలార్‌దేవ్‌పల్లి ఠాణాను ముట్టడించేందుకు యత్నించారు. సైబరాబాద్ సీపీ మహంతి వారిని సముదాయించి, జరిగిన నష్టానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని, దాడిచేసిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామని తెలపడంతో ఆందోళనకారులు శాంతించారు. ఇదిలా ఉండగా ముషీరాబాద్‌లో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో ఓ వర్గం వారు ముషీరాబాద్ ఠాణాకు చేరుకుని ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు పోస్టు పెట్టిన యువకుడిని గుర్తించి అరెస్టు చేశారు.