ఏండ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న నాలాలతో నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా.. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. ఇండ్లలోకి వరద నీరు ముంచెత్తేది. ఇక భారీ వర్షాలు పడ్డాయంటే.. ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. వరద నీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపేవారు. ఏటా వర్షాకాలంలో నగరం భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయింది. ఈ దుస్థితికి కారణం వరద ప్రవాహ వ్యవస్థ సరిగా లేకపోవడమే. కానీ.. ఈ ఏడాది వర్షాలు దంచికొట్టినా.. అలాంటి పరిస్థితి ఎక్కడా ఏర్పడలేదు. దశాబ్దాల తరబడి నగరాన్ని వేధిస్తున్న అస్తవ్యస్తమైన వరద కాల్వల వ్యవస్థను గాడిన పెట్టేందుకు బల్దియా చేపట్టిన ఎస్ఎన్డీపీ చాలా ప్రాంతాల్లో వరద కష్టాలను శాశ్వతంగా తీర్చింది. నగరవ్యాప్తంగా చేపట్టిన 36 నాలాల అభివృద్ధి పనుల్లో ఇప్పటికే 30 పూర్తయ్యాయి. మిగిలిన 6 పురోగతిలో ఉన్నాయి. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకం కింద కొత్త నాలాల నిర్మాణం, పాత నాలాల పునరుద్ధరణ పనులతో అనేక చోట్ల ముంపు బాధలు తప్పాయి. ఈ వారంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినా.. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలువలేదు. జనజీవనమూ స్తంభించలేదు. పైగా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా చేపట్టిన విపత్తు నిర్వహణతో నగరంలో జన జీవనం సాధారణంగా సాగింది.
ఇది మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలోని జల్పల్లి శ్రీధర్ కాలనీ. ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే రోడ్లు కనిపించేవి. మిగిలిన నెలల్లో అంతా వరద నీరే దర్శనమిచ్చేది. ఈ కాలనీలో కనీసంగా ఆరు నెలల పాటు వరద నీరు పారేది. అప్పట్లో మంత్రిసబితాఇంద్రారెడ్డి వరద నీటిలోనే పర్యటించిన దృశ్యమిది.
శ్రీధర్కాలనీలో మారిన నేటి పరి స్థితి ఇది. భారీ వర్షాలు కురిసినా ఇప్పుడు కాలనీలో నీరు నిలువడం లేదు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ బల్దియా నుంచి రూ.11 కోట్ల నిధులు ఇప్పించారు. వీటికి తోడు మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రూ.2 కోట్ల నిధులు జోడించి.. కాలనీలో వరద నిల్వ ఉండకుండా భారీ ఎత్తున ్రడ్రైన్ బాక్సుల నిర్మాణం చేపట్టారు. దీంతో శ్రీధర్కాలనీ ముంపు గోస తీరింది.
మల్కాజిగిరి నియోజకవర్గంలోని వినాయకనగర్ డివిజన్ దీన్‌దయాళ్‌నగర్ లో భారీ వర్షాలు వచ్చాయంటే ఇక్కడి ప్రజల గోస వర్ణనాతీతంగా ఉండేది. రాత్రి వర్షం పడిందంటే.. తెల్లారేసరికి కాలనీలు చెరువులను తలపించేవి. జనం ఇండ్ల నుంచి కనీసం బయటికొచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు. రోజుల తరబడి నీళ్లలోనే గడిపే కాలనీవాసులకు ఆహార పొట్లాలను సైతం అందించిన ఘటనలు అనేకం.
ఎస్ఎన్డీపీతో దీన్దయాళ్నగర్కు వరద బాధలు తీరాయి. ఎమ్మెల్యే మైనంపల్లి చొరవతో మంత్రి కేటీఆర్ సమస్య పరిష్కారం కోసం ఎస్ఎన్డీపీ కింద రూ.105 కోట్లు కేటాయించగా, రూ.65 కోట్లతో వరద నీటిని మళ్లించే బాక్స్ డ్రైన్లు నిర్మించారు. తద్వారా దీన్‌దయాళ్‌నగర్, షిర్డీ నగర్లో ముంపు సమస్య తీరింది. అలాగే రూ.40 కోట్లతో యాప్రాల్ నుంచి కాప్రా చెరువు వరకు బాక్స్ డ్రైన్ నిర్మాణాలు చేపట్టారు.
చినుకుపడితే చాలు.. కూకట్పల్లి నుంచి బేగంపేట మీదుగా సాగర్‌లోకి ప్రవహించే నాలా ఉప్పొంగేది. బ్రాహ్మణవాడి, వడ్డెరబస్తీ, మయూరిమార్గ్, ప్రకాశ్‌నగర్, అల్లంతోట బావి, మాతాజీ నగర్, రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ ప్రాంగణం ఇలా కాలనీలన్నీ జలమయమయ్యేవి.
ఎస్ఎన్డీపీతో ముంపు కష్టాలకు తెరపడింది. ఎస్ఎన్డీపీలో భాగంగా రూ.45 కోట్లతో పనులు చేపట్టారు. కూకట్పల్లి, బేగంపేట్ నాలాల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. రిటైనింగ్ వాల్స్, చుట్టూ ప్రహరీ , నాలాల్లో పూర్తిస్థాయిలో పూడిక తీయడం వంటి పనులతో భారీ వర్షాలు కురిసినా కాలనీల్లో వరద నీరు కనిపించడం లేదు.
ఎల్బీనగర్ : ఎల్బీనగర్ జోన్‌లోని ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్ సర్కిళ్ల పరిధిలో ఎస్ఎన్డీపీ కింద ముమ్మరంగా నాలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మూడు సర్కిళ్లలో సుమారు రూ.113 కోట్ల వ్యయంతో ప్యాకేజీల వారీగా పనులు చేపట్టారు. ప్రధానంగా బండ్లగూడ, నాగోలు చెరువుల నుంచి మూసీ నది వరకు నిర్మించిన వరదనీటి కాలువతో గతంలో ఇబ్బందులు పడిన కాలనీల వాసులు ప్రస్తుతం ఉపశమనం పొందుతున్నారు.
బండ్లగూడ నుంచి నాగోలు వరకు రూ.7.26 కోట్లతో 990 మీటర్లు నిర్మించిన నాలా పనులు పూర్తయ్యాయి. ఈ పనులతో రాఘవేంద్రకాలనీ, గేట్‌వే కాలనీ, లేక్ వ్యూ కాలనీ, వెంకటరమణా కాలనీ, విశాలాంద్ర కాలనీలకు ముంపు సమస్య తీరడంతో పాటుగా అయ్యప్ప కాలనీలో కొంత మేర ఇబ్బంది తొలగింది.
రూ.30.08 కోట్లతో బండ్లగూడ చెరువు నుంచి మూసీ నది వరకు 2699 మీటర్లు నాలా నిర్మాణం చేపట్టారు. 80శాతం పనులు పూర్తయ్యాయి. బండ్లగూడ చెరువు దిగువ కాలనీలు, నాగోలు చెరువు దిగువ కాలనీలు కూడా ప్రస్తుతం భారీ వర్షాలు కురిసినా ముంపునకు గురి కాలేదు. గతంలో వరదనీటి కాలువ నిర్మాణం చేపట్టకపోవడంతో చాలా వరకు కాలనీలు ముంపునకు గురయ్యేవి. ఈ వరద కాలువల నిర్మాణంతో నాగోలు డివిజన్, మన్సూరాబాద్ డివిజన్లలోని కొన్ని కాలనీలకు వరద ముంపు సమస్య నుంచి విముక్తి లభించింది. అరుణోదయ కాలనీ, న్యూ మమతానగర్, వెంకటరమణ కాలనీ, సాయిరాంనగర్ కాలనీలకు విముక్తి లభించింది. ఈ పనులతో సుమారు 12వేల నివాసాలకు మేలు జరుగుతుంది.
బాతుల చెరువు నుంచి ఇంజాపూర్ నాలా వరకు రూ.9.65 కోట్లతో 1997 మీటర్ల నాలా నిర్మాణం పూర్తి చేశారు. ఈ నాలా నిర్మాణంతో బీజేఆర్ కాలనీ, బొగ్గుల గంగారెడ్డి కాలనీ, డిపెన్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, తిరుమల నగర్ కాలనీల్లోని 4వేల నివాసాలకు ముంపు సమస్య నుంచి దాదాపుగా విముక్తి కలిగింది.
చంద్రా గార్డెన్ నుంచి సరూర్‌నగర్ చెరువు వరకు ఎస్ఎన్డీపీ పనులు 55 శాతం పూర్తయ్యాయి. వంగ శంకరమ్మ గార్డెన్ నుంచి సరూర్‌నగర్ చెరువు వరకు పనులు 60శాతం పూర్తయ్యాయి. ఈ పనులు పూర్తయితే అనేక కాలనీల్లో ముంపు సమస్య ఉండదు.
ఉప్పల్ సర్కిల్లో రామంతాపూర్ పెద్ద చెరువు నుంచి ఇరిగేషన్ చానల్ వరకు రూ.10.34 కోట్లతో చేపట్టిన వరద నీటి కాలువ కూడా 99శాతం పూర్తయ్యింది. దీంతో ఈ ప్రాంతంలోని ప్రగతినగర్, రామంతాపూర్, ఇంద్రానగర్, అరవిందనగర్, భరత్‌నగర్, గాంధీనగర్, రవీంద్రనగర్, లక్ష్మీనగర్‌లలో ముంపు సమస్యలకు తెర పడింది. సుమారు 4వేల నివాసాలకు ముంపు నుంచి విముక్తి లభించింది.
నాగోలు, కొత్తపేట డివిజన్లలో ఆదర్శనగర్ కాలనీ నుంచి మూసీ వరకు, అలకాపురి రాఘవేంద్ర హోటల్ నుంచి మూసీ వరకు నిర్మించిన వరద నీటి కాలువల నిర్మాణంతో ఆదర్శనగర్, నాగోలు ప్రధాన రహదారి, న్యూ నాగోలు, సమతాపురి కాలనీల్లో వరద ముంపు సమస్య దాదాపుగా తీరిపోయింది.