KTR | నీట్ యూజీ 2026 పరీక్ష(NEET UG 2026)ను రద్దు చేసిన విషయం తెలిసిందే. మే 3వ తేదీన నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేసినట్లు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)..నీట్ పరీక్షకు చెందిన కొత్త తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నది. ఈ నేపథ్యంలో నీట్ ప్రశ్నాపత్రం లీక్ కారణంగా మొత్తం పరీక్షనే రద్దు చేయాల్సింతగా పరిస్థితి దిగజారినందుకు కేంద్రప్రభుత్వం సిగ్గుపడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
రాత్రిపగలు అవిశ్రాంతంగా చదువుకున్న లెక్కలేనంత మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రప్రభుత్వం చెలగాటమాడిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పరీక్షలను సురక్షితంగా నిర్వహించడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమవడం వల్ల జరిగిన మరో ప్రశ్నాపత్రం లీక్ ఇదన్నారు. 2024 నీట్ ప్రశ్నాపత్రం లీక్ నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే ఈ ఘటన పునరావృతమైందని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రశ్నాపత్రం లీకేజీని కేంద్రప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణించి తక్షణమే అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనికి వెనకాల ఎంత పెద్ద వ్యక్తుల హస్తముందనేది విషయం కాదు.. వారందరినీ పట్టుకోవాల్సిన అవసరముంది. వారిని కఠినంగా శిక్షించి ప్రజల ముందు పెట్టాలన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని.. నైతిక బాధ్యత వహిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
♦️ నీట్ ప్రశ్నాపత్రం లీకై ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
🔹 పగలూ రాత్రి కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడింది.
🔹 పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని… pic.twitter.com/69Le3IVStS
— BRS Party (@BRSparty) May 12, 2026