సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ గ్రేటర్ పరిధిలో తీవ్ర అసంతృప్తిని మిగిలిస్తోంది. కీలకమైన డిజిటలైజేషన్ నత్తనడకన సాగుతున్నది. బీఎల్వోలు ఇళ్ల వద్దకు వచ్చి స్వీకరించిన ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ ఊహించిన స్థాయిలో వేగం పుంజుకోకపోవడంతో సాధారణ ఓటర్లు, పౌరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఓటర్ల నుంచి బీఎల్వోలు సేకరించిన ఫారాలను డేటా ఎంట్రీ అధికారులు ఆన్లైన్ సిస్టం నమోదు చేయడంతో సాంకేతిక లోపాలు, సర్వర్ సమస్యలు పెద్ద అవరోధంగా మారడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే జిల్లాలో బుధవారం వరకు 54.79 శాతం మాత్రమే డిజిటలైజేషన్ ప్రక్రియ జరిగింది. మరో ఐదు రోజుల్లో నిర్ధేశిత గడువు మగియనుండడంతో ఓటర్లలో ఆందోళన పెరిగింది. చివరి నిమిషంలో బీఎల్వోలు అబ్సెంట్ అని పెడితే ఓటర్ జాబితాలో తమ పేర్లు గల్లంతు అవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముంచుకొస్తున్న గడువు..
‘బీఎల్వోలు వచ్చి ఫారాలు ఇచ్చి వెళ్లారు. కానీ వాటిని తిరిగి ఎప్పుడు తీసుకుంటారో.. ఎప్పుడు ఆన్లైన్ చేస్తారో స్పష్టత లేదు. గడువు ముగిసిపోతే మా ఓటు హకు గల్లంతవుతుందేమోనని భయంగా ఉంది.’ అని నగరానికి చెందిన పలువురు ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 3వ తేదీతో గడువు ముగియనుంది. నిర్దేశిత గడువుకు ఇంకా ఐదు రోజులే సమయం ఉండటంతో జీహెచ్ఎంసీ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే లక్షలాది మంది ఓటర్ల వివరాల నమోదు పెండింగ్లో పడే ప్రమాదం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా /మొత్తం బీఎల్వోలు : డిజిటలైజేషన్ (శాతం)
హైదరాబాద్ /4062 : 54.79
రంగారెడ్డి /3501 : 62.38
మేడ్చల్-మల్కాజిగిరి/2435 : 59.57