కడ్తాల్, జూన్ 9 : మండల కేంద్రంలో జరిగిన యువకుల హత్య కేసును త్వరగా విచారించేందుకు, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేసి నిందితులకు కఠిన శిక్ష విధించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 5న కడ్తాల్ సమీపంలోని బట్టర్ఫ్లై వెంచర్‌లోని విల్లాలో గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన శేషుగారి శివగౌడ్, గుండెమోని శివగౌడ్ దారుణ హత్యకు గురయ్యారు. కాగా, ఆదివారం కడ్తాల్ మండల పరిధి గోవిందాయిపల్లి గ్రామంలోని మృతుల కుటుంబ సభ్యులను మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, వైస్ ఎంపీపీ ఆనంద్, స్థానిక నాయకులతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు యువకులు హత్యకు గురికావడం విచారకరమని తెలిపారు. జంట హత్యలు జరగడం తెలంగాణ సమాజానికి దిగ్భాంత్రికి గురి చేసిందన్నారు. కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉండే సమయానికి చేతికొచ్చిన కుమారులను కోల్పోవడంతో ఆయా కుటుంబాలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యలు యాదృచ్ఛికంగా జరగలేదని, పక్కా పథకం ప్రకారమే కక్ష తీర్చుకోవడానికి, యువకులను అడ్డు తొలగించుకోవడం కోసం చేశారని ప్రాథమికంగా సమాచారం అందుతున్నదని తెలిపారు. వాట్సాప్ గ్రూప్‌లో వేసిన ఫొటోలను తొలగించినందుకు, కసి తీర్చుకోవడానికి హత్యలు జరిగాయనే కోణంలో కాకుండా, దీని వెనకాల బలమైన రాజకీయ కారణాలు ఉండవచ్చని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని.. వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆయన కోరారు.
ఈ ప్రాంతంలో మాఫియా సంస్కృతిని గతంలో తాను ఎప్పుడూ చూడలేదని, ఈ ప్రాంతంలో నయీం ముఠాకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని.. ఆ దిశగా పరిశోధన జరపాలని ప్రవీణ్‌కుమార్ పోలీసులను కోరారు. హత్యల వెనుక ఆ ముఠా మాజీ సభ్యుల హస్తం ఉన్నట్లు గ్రామస్తులందరూ తన దృష్టికి తీసుకువచ్చారని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరారు. ప్రశాంత వాతావరణం ఉండే ఈ ప్రాంతంలోని గ్రామాల్లో ఇలాంటి దారుణ హత్యలు జరగడం దారుణమని ఆయన పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ దందాలకు సంబంధించిన పంచాయితీలు జరగడం, వాటికి రాజకీయాలు తోడవడం, ఆధిపత్య పోరాటం, ఈ ప్రాంతంలోకి హత్యల సంస్కృతి రావడం విచారకరమన్నారు. ఇందులో నయీం ముఠా ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, నిందితుల కాల్ డేటా పరిశీలించాలని కోరారు. నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ పూర్తి చేసి, యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తిరిగి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లచ్చిరాంనాయక్, నాయకులు వీరయ్య, తులసీరాంనాయక్, జ్యోతయ్య, పాండునాయక్, లాయక్‌అలీ, రఘు పాల్గొన్నారు.