కుత్బుల్లాపూర్, జూన్ 21: హైడ్రా పేరు చెప్పుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న బ్లాక్ మెయిలర్ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోలన్ హన్మంత్ రెడ్డికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను విమర్శించే నైతిక హక్కు లేదని టీఆర్ఎస్ నియోజకవర్గ శ్రేణులు హెచ్చరించారు. శనివారం చింతల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను విమర్శించే స్థాయి నీది కాదన్నారు.
హైడ్రా పేరుతో వసూళ్ల దందా చేసి, నీచ రాజకీయాలకు తెరలేపుతూ బిల్డర్లను, నిర్మాణదారులను ముప్పతిప్పలు పెడుతున్న తీరుపై త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎన్నికల్లో ఓడిపోయి స్థానికంగా ఉండకుండా జూబ్లీహిల్స్ లో ఉంటున్న హన్మంత్ రెడ్డి.. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. మొన్నటి ఎన్నికల్లో నీవు మూడో స్థానానికి పడిపోయినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. 18 నెలలుగా కాంగ్రెస్ పాలనలో హైడ్రా పేరుతో ప్రజలను భయపెడుతూ నీవు చేసే వసూళ్లపై నిజాంపేట్ లో ఏ బిల్డర్ను అడిగిన చెబుతారన్నారు.
బాచుపల్లి సాయి నగర్ లో దొంగ పట్టాలు తయారు చేసి అమ్మితే టీడీపీ నుంచి గెంటేసింది వాస్తవం కాదాఅని ప్రశ్నించారు. బాచుపల్లి, మల్లంపేట్, భౌరంపేటలలోని చెరువులు, నాలాలపై నీవు చేసిన ఆక్రమణలపై జైలుకు పోవాల్సిందన్నారు. గత పదేళ్లలో ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ లో ఉండి తర్వాత అమ్ముడుపోయిన నీవు అప్పుడు నిద్ర పోయినావా..? ఇప్పుడు చెరువులు, కుంటలు అనుకుంటూ ప్రగల్భాలు పలుకుతున్నావని ప్రశ్నించారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని ఒకసారి జడ్పీటీసీగా, మరొకసారి ఎమ్మెల్యేకి అవకాశం కల్పించిదని గుర్తు చేశారు.
హన్మంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో, లేదంటే కుత్బుల్లాపూర్ ప్రజలు రాజకీయ భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో కస్తూరి బాలరాజు, దుదిమెట్ల సోమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు అశోక్, శంకరయ్య, నాయకులు అడ్వకేట్ కమలాకర్, వేణు యాదవ్, కుంట సిద్ధిరాములు, జ్ఞానేశ్వర్, యేసు, నదీమ్ రాయ్, ఆటో బలరాం, నార్లకంటి శ్యాం, నార్లకంటి కు మార్, కుంట వేణు, తెలంగాణ సాయి, గణేశ్, బాల మల్లేశ్, శ్రీకాంత్, సాజిద్, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.