సిటీ బ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): పేద విద్యార్థులకు ప్రైవేట్ విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన బెస్ట్ అవైలబుల్ పథకం ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన పేద విద్యార్థులను ఎంపిక చేసిన ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించడం ఈ పథకం ఉద్దేశం. అయితే ఈ పథకం ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సంబంధించిన ఫీజులను ఆయా ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఈ స్కీమ్‌కు సంబంధించిన ఫీజులను విడుదల చేయకపోవడంతో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఈ స్కీం ద్వారా ఎంపికైన విద్యార్థులను చేర్చుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.
159 మంది విద్యార్థులకు ప్రవేశాలు
బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా హైదరాబాద్ జిల్లాలోని పేద ఎస్సీ సామాజికవర్గానికి చెందిన 159 మంది విద్యార్థులను లాటరీ విధానం ద్వారా ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 10 పాఠశాలల్లో వారికి సీట్లను కేటాయించారు. ఈ ప్రవేశాలను ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడతారు. ఎంపికచేసిన 159 మంది విద్యార్థులకు సంబంధించిన పాఠశాలల ఫీజులను రాష్ట్ర ఆర్థికశాఖ నుంచి ఎస్సీ సంక్షేమ శాఖకు కేటాయించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంనిధులను కేటాయించకపోవడంతో 10 పాఠశాలల్లోని మెజార్టీ పాఠశాలలు విద్యార్థులకు సీట్లివ్వలేమని తేల్చి చెబుతున్నాయి.
ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు..
పాఠశాలలు తెరిచి 2 నెలలవుతున్నా తమ పిల్లలను చేర్చుకోకపోవడంతో విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కీంకు ఎంపికైన సమయంలో తమ పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు అవకాశం లభించిందని సంతోషపడ్డామని, కానీ ఆయా పాఠశాలలు సీట్లు లేవంటున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.