సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): నగరంలో కీలకమైన ఆ రెండు జోన్లలో పనిచేసే పోలీసు ఉన్నతాధికారుల తీరు తీవ్ర చర్చకు దారితీస్తున్నది. ఫిర్యాదుదారులే లక్ష్యంగా ఆ ఇద్దరు అధికారులు ఎవరి ైస్టెల్లో వారు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ప్రజలనుంచి ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా.. సదరు అధికారులు వారికున్న రాజకీయ అండదండలతో ఆయా డివిజన్లలో చాలా ఏండ్లనుంచి పాతుకుపోయారు. ఒకరేమో సంగారెడ్డి జిల్లాను నమ్ముకుంటే.. మరొకరేమో తాను పనిచేసే డివిజన్‌కు సంబంధించిన ముఖ్యనేతకు ప్రధాన అనుచరుడుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. నగర ఉమ్మడి దక్షిణ ప్రాంతానికి కీలక అధికారి అతను.
ఆ ప్రాంతంలోని ఏ పీఎస్‌లో సెటిల్మెంట్లకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా సదరు అధికారి అందులో వెంటనే దూరిపోతాడు. ఇరువర్గాలతో మాట్లాడి ఎవరైతే ఎక్కువ ఆమ్యామ్యాలు ఇస్తారో వారికి వత్తాసు పలుకుతాడు. ఇక మరో అధికారి సెంట్రల్ జోన్ (సైఫాబాద్)లోని కీలక డివిజన్‌కు ప్రధాన అధికారిగా వ్యవహరిస్తున్నాడు. తన పరిధిలో ఓ ప్రముఖ మల్టీకాంప్లెక్స్ వద్ద ఉండే ఓ గ్యాంగ్‌కు ఈ అధికారి అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతున్నది. సంబంధిత గ్యాంగ్ ఆ ఏరియాలో జరిగే అన్ని పంచాయతీలను ఈ అధికారి సమక్షంలోనే తీరుస్తాడనే టాక్ ఉన్నది.
నగర ఉమ్మడి దక్షిణ ప్రాంతంలో..
సిటీలోని ఉమ్మడి దక్షిణ ప్రాంతంలో నెలరోజుల క్రితం తన పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌కు సంబంధించి 18 ఎకరాల భూమి పంచాయితీ వచ్చింది. సంబంధిత కేసులో రెండువర్గాల మధ్య వారసత్వ గొడవ జరుగుతున్నది. ఇందులో మూడెకరాలకు సంబంధించి అధికారికంగా కొనుక్కుని తమ వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నవారు భూమి వద్దకు వెళ్తే.. అక్కడ వేరే వాళ్లు కబ్జాలో ఉండటంతో వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరి అక్కడినుంచి సదరు అధికారికి చేరింది. ఈ వ్యవహారంలో భూమి కొనుగోలు చేసిన వ్యక్తులను బెదిరించిన సదరు పోలీసు అధికారి అవతల వారి నుంచి రూ.50లక్షలు తీసుకున్నారని, అదే భూకబ్జాదారులకు సంబంధించిన మరో వ్యవహారం కూడా సెటిల్ చేసి తన దగ్గరి వ్యక్తి పేరుమీద ప్లాట్ తీసుకున్నట్లు పోలీస్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
మరో వ్యవహారంలో తన దగ్గరకు వచ్చిన ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న జాగ పంచాయితీలోనూ సుమారు రూ.12లక్షలు తీసుకున్నట్లు స్థానికంగా టాక్. ఈ విషయంలో డీల్ జరిగే సమయంలో ఆ వ్యక్తులు వినకపోతే స్థానిక ఇన్స్పెక్టర్ను కేసు బుక్ చేయాలని చెప్పగా అతను కష్టమని చెప్పారు. ఆ తర్వాత నయానోభయానో బెదిరించి వారిదగ్గర డబ్బులు లాగినట్లు తెలిసింది. తన పరిధిలో ఓ స్టేషన్‌కు సంబంధించి గత సంవత్సరం కొన్ని హద్దులు మారాయి. ఈ ప్రాంతంలో డ్రగ్స్, గంజాయి ఎక్కువగా వినియోగం జరుగుతున్నది. ఈ విషయం తెలిసినప్పటికీ తన కింది అధికారులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ మామూళ్లు ఇచ్చేవారిని ముట్టుకోవద్దని, మిగతావారిపై కేసులు బుక్ చేయమని చెప్పి బెదిరించారు.ఆ తర్వాత వారు కూడా దారికి రావడంతో గత కొన్నిరోజులుగా కేసులే లేవని పోలీసు వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇక సాధారణంగా వచ్చే మామూళ్ల ముచ్చట సరేసరి.
ఆ గ్యాంగ్‌కు ఆయనే బలం..
నగర దక్షిణ ప్రాంతంలో పనిచేసే ఆ అధికారికి తన పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో ఏ కేసు వచ్చినా సెటిల్ కావాలని చెప్పడం, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రాగానే ఒకట్రెండు కేసులు చేయడం అలవాటైపోయింది. మరో రెండుమూడేళ్లల్లో రిటైర్ కాబోతున్న నేపథ్యంలో తాను సంపాదించుకోవాలని, తనకు సహకరించాలని కింది అధికారులకు ఆయన చెబుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల ఓ గ్యాంగ్ మెంబర్ ఒకరు ప్రధాన రహదారిపై యాక్సిడెంట్ చేస్తే కేసు కాకుండా ఉండడానికి గ్యాంగ్మెంబర్ దగ్గర నుంచి రూ.25లక్షలు తీసుకుని చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని బెదిరించి కేసు లేకుండా చేయడంతో పాటు వారికి రూ.10లక్షలు ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో కీలకమైన ప్రాంతం కావడంతో అక్కడ రాత్రిపూట కూడా జనం తిరుగుతుంటారు.
ఆ ప్రాంతంలో నేరాలకు మూలమైన ఈ గ్యాంగ్‌కు ఈ అధికారి అండదండలే ఉండటంతో స్టేషన్ల ఇన్స్పెక్టర్లు కిక్కురుమనకుండా ఉంటున్నారు. ఈ ఏడాది ఇదే గ్యాంగ్ ఒక యువకుడిని కొట్టగా అతను అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులోనుంచి కొందరిని తప్పించేందుకు ముఖ్యమైన వ్యక్తి మినహా వారి దగ్గర నుంచి సుమారు రూ.25లక్షలు వసూలు చేశారని సమాచారం. అయితే కేసు చాలా సీరియస్‌గా మారడంతో దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిపై కేసు నమోదుచేశారు. స్థానిక ప్రజలు ఆయన ఎదురుగానే మీ వల్లే ఈ ప్రాంతంలో ఈ గ్యాంగ్ ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆరోపించినప్పటికీ ఆ అధికారిలో కనీసం చలనంలేదనే విమర్శలున్నాయి. మరోవైపు సదరు గ్యాంగ్ నిత్యం థియేటర్ పక్కనే ఉన్న స్థలంలో రాత్రివేళల్లో కాపుకాసి దారినపోయేవారిని బెదిరించి దోపిడీ చేస్తుంటారని.. ఈవిషయం పోలీసులకు తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పారు.
డీల్ కుదరకపోతే అక్రమ కేసుల బనాయింపు!
తమ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లలో ఏ ఫిర్యాదు వచ్చినా సిబ్బందిలో ఒకరిద్దరిని తన అనుచరులుగా పెట్టుకుని ముందు వారితో మాట్లాడించి సెటిల్మెంట్కు ఒప్పించడం.. ఒకవేళ డీల్ కుదరకపోతే ఎదుటి వ్యక్తులపై కేసులు పెట్టడం ఇది ప్రస్తుతం పీఎస్‌లలో జరుగుతున్న నయా ట్రెండ్. సెంట్రల్ జోన్‌లోని అధికారి దగ్గరకు వచ్చే కేసులన్నీ దాదాపుగా కోట్ల రూపాయలకు సంబంధించిన డీల్స్ కావడంతో వాటిని ఆ గ్యాంగ్‌కు అప్పగించి ఎవరికెంత అనేది కూడా రేట్ ఖరారుచేస్తారని ప్రచారం జరుగుతున్నది. బయట ప్రాంతాల నుంచి డబ్బులు వసూలు చేయడానికి తన పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులతో పాటు నలుగురు సిబ్బందిని వాడుకుంటున్నట్లు తెలిసింది.
ఇక నగర ఉమ్మడి దక్షిణ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న మరో అధికారి తన దగ్గరకు కేసులు రాకపోతే వాటి గురించి తెలుసుకుని మరీ కిందిస్థాయి అధికారుల ను వేధిస్తున్నారట. ఏ ఫిర్యాదు నమోదు కావాలన్నా సదరు అధికారి దృష్టికి వెళ్లి ఆయన ఓకే అంటేనే ఫిర్యాదులు తీసుకుంటారని, లేదంటే సెటిల్మెంట్ జరిగినట్లేనని ఇరువర్గాలతో మాట్లాడి ఒక డీల్ కుదిర్చి తన వాటా తీసుకుంటున్నట్లుగా ఆయన దగ్గర పోలీసులే వాపోతున్నట్లు సమాచారం. ఇక మామూళ్లకు సంబంధించి తనకు నమ్మకస్తులైన ఓ కానిస్టేబుల్, ఇద్దరు ఇన్స్పెక్టర్ల ద్వారా వసూళ్లు చేయిస్తున్నట్లు తెలిసింది.
కిందిస్థాయి సిబ్బందికి వేధింపులు!
సదరు అవినీతి అధికారులు తమ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో నెలవారీ మామూళ్లు ఇవ్వని కిందిస్థాయి పోలీసు అధికారులను ముప్పుతిప్పలు పెట్టడం, వారిపై వేధింపులు, అవసరమైతే ఏదో ఒక కేసులో ఇరికించి ఇబ్బందులు పెట్టడం వంటివి చేస్తుంటారనే టాక్. ‘కేసు నమోదు చేయాలంటే ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ఓ రేటు, ఒకవేళ ఒకరు వినకపోతే వారిపై కేసు పెట్టాలి’ అంటూ కింది స్థాయి ఉద్యోగులకు వేధింపులు తప్పడం లేదు. అప్పటికీ మాట వినకపోతే ఉద్యోగులకు మెమోలు ఇవ్వడం, వారిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
ఇటీవల నగర ఉమ్మడి దక్షిణ ప్రాంతంలో సదరు అధికారి తన మాట విననందుకు ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్ఐలకు మెమోలు ఇవ్వడం కమిషనరేట్‌లో చర్చనీయాంశమైంది. గతంలో ఓ ఆత్మహత్య కేసులో.. సదరు అధికారి ముడుపులు దండుకుని నిందితులను తప్పించే ప్రయత్నంలో ఇన్స్పెక్టర్ను ఇరికించగా ఆయనపై బదిలీవేటు పడింది. ఇటీవల యువకుల ఘర్షణకు సంబంధించిన కేసు నేపథ్యంలో అందులో ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. ఈరెండు కేసుల్లోనూ సదరు అధికారుల ప్రమేయం ఉన్నట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.